Honeymoon: ‘‘హనీమూన్ డెస్టినేషన్’’కి సంబంధించి మామ అల్లుడి మధ్య గొడవ చివరకు యాసిడ్ దాడికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర థానే జిల్లాకు చెందిన 29 ఏళ్ల కొత్తగా పెళ్లయిన వ్యక్తి తన భార్యతో హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్తామనుకున్నాడు. అయితే, దీనిపై వివాదం చెలరేగడం మామ అతడిపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనలో అల్లుడు గాయపడినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
Read Also: Rahul Gandhi: బీజేపీ ఎంపీలే మాపై కర్రలతో దాడి చేశారు..
అల్లుడు ఇబాద్ అతిక్ ఫాల్కే ఆస్పత్రిలో చేరగా, నిందితుడు జాకీ గులాం ముర్తాజా ఖోటాల్(65) ప్రస్తుతం పరారీలో ఉన్నాడని కళ్యాణ్ ఏరియాలోని బజార్ పేట్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఫాల్కే ఇటీవల ఖోటాల్ కుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఫాల్కే తన హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్లాలని అనుకున్నాడు. అయితే, అతడి మామ దంపతులు ఇద్దరూ విదేశాల్లోని మతపరమైన ప్రదేశాలకు వెళ్లాలని కోరుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
బుధవారం రాత్రి ఫాల్కే ఇంటికి తిరిగి వచ్చి, రోడ్డుపై తన వాహనాన్ని పార్క్ చేశాడు. తన కారులో అతని కోసం వేచి చూస్తున్న ఖోటాల్, ఫాల్కే వెనక నుంచి వెళ్లి యాసిడ్ పోశాడు. దీంతో బాధితుడి ముఖం, శరీరంపై గాయాలు అయ్యాయి. ఖోటాల్, ఫాల్కేతో తన కుమార్తె వివాహాన్ని రద్దు చేయాలని అనునకున్నాడు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ఖోటాల్‌పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌లు 124-1 (స్వచ్ఛందంగా యాసిడ్ వాడకం ద్వారా తీవ్రమైన గాయాన్ని కలిగించడం), 351-3 (నేరపూరిత బెదిరింపు) మరియు ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.