Live-In Relation: సహజీవనం చేస్తూ సర్వస్వం అర్పిస్తున్న యువతులు హత్యకు గురవుతున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య దేశంలో లివ్-ఇన్ రిలేషన్‌లో పరిణామాలను హెచ్చరించింది. ఏళ్లుగా సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చే సరికి మహిళల్ని కడతేరుస్తున్నారు. ఇటీవల అలహాబాద్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశ సంస్కృతికి ఈ విధానం నష్టం చేకూరుస్తుందని పేర్కొంది.
తాజాగా లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న మరో మహిళ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న 28 ఏళ్ల మహిళ, తనపై లవర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు తర్వాత మహిళను ఆమె భాగస్వామి దారుణంగా హత్య చేశాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ఈ హత్యకు అతని భార్య కూడా సహాయం చేసింది. మహిళను చంపేసి పక్క రాష్ట్రం గుజరాత్ లోని వల్సాద్ లో పడేశారు.
Read Also: Kerala High Court: స్విగ్గీ, జోమాటోలు వద్దు.. పిల్లల్ని తల్లి వండిన ఆహారం రుచిచూడనివ్వండి..
మరణించిన మహిళను చిత్ర పరిశ్రమలో మేకప్ ఆర్టిస్టుగా చేస్తున్న నైనా మహత్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడు మనోహర్ శుక్లాతో ఆమెకు 5 ఏళ్లుగా సంబంధం ఉంది. శుక్లా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని కొంత కాలంగా మహత్, శుక్లాపై ఒత్తిడి తెస్తుందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి అతను నిరాకరించడంతో, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విత్ డ్రా చేసుకోవాలని శుక్లా, నైనా మహత్ ను కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడు.
హత్య అనంతరం శుక్లా తన భార్య సహాయంతో ఓ సూట్‌కేస్ లో శవాన్ని పెట్టుకుని పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ కి సమీపంలోని చిన్న వాగులో పడేశారు. ఈ ఘటన ఆగస్టు 9న జరిగింది. అయితే నైనా కనిపించడం లేదని ఆగస్టు 9న కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 12 తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ అయిందని మృతురాలు సోదరి జయ చెప్పింది. పోలీసుల విచారణలో శుక్లా నిందితుడని తేలింది. అతడిని, ఆయన భార్యను మంగళవారం అరెస్ట్ చేశారు.