Site icon NTV Telugu

Marriage Fraud: పెళ్లి పేరుతో ఒంటరి మహిళను ట్రాప్ చేసి రూ. 28 కోట్ల మోసం..

Lottery Scam

Lottery Scam

ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి రూ.28 కోట్లు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక్కడ.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శివ ప్రసాద్ నాయుడు. వీడు మామూలోడు కాదు. బెంగళూరుకు చెందిన ఓ మహిళను పెళ్లి పేరుతో చీటింగ్ చేశాడు.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేటకి చెందిన నాగమణికి 1992లో ఒక వ్యక్తితో వివాహమైంది. ఒక కొడుకు కూడా పుట్టాడు. కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. అదే దిగులుతో భర్త కూడా మరణించాడు. కొడుకు బీమా డబ్బులు, భర్త ఆస్తులన్నీ నాగమణికి వారసత్వంగా వచ్చాయి..

READ MORE: Shine Tom Chacko: బహిరంగంగా క్షమాపణలు చెప్పిన ‘దసరా’ విలన్‌.. వివాదానికి ముగింపు!

ఒక్కగానొక్క కొడుకు, భర్త మృతి చెందడంతో ఎంత ఆస్తి ఉండి ఏం లాభం అనుకుంది. మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించింది. ఇందుకోసం చిత్తూరులోని ఓ పెళ్లిళ్ల మధ్యవర్తిని సంప్రదించింది. ఈ క్రమంలో బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్‌ నాయుడు ఆమెకు పరిచయం అయ్యాడు. తన భార్య చనిపోయిందని, పిల్లలు కూడా లేరని చెప్పాడు. పైగా భార్య డెత్ సర్టిఫికెట్లు కూడా చూపించాడు. దీంతో నాగమణి అతన్ని నమ్మింది. ఆ తర్వాత పెళ్లికి అంగీకరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో శివప్రసాద్‌ నాయుడిని 2022 అక్టోబర్‌లో కర్ణాటకలోని బంగారు తిరుపతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఇద్దరు కాపురం పెట్టారు..

READ MORE: Hyderabad: పెళ్లై రెండు నెలలైనా కాలేదు..! భర్త ఆత్మహత్య.. హుస్సేన్‌ సాగర్‌లో దూకిన భార్య

కొన్ని రోజుల తర్వాత శివ ప్రసాద్ నాయుడు అసలు కథ మొదలు పెట్టాడు. తనకు ఆర్‌బీఐ నుంచి రూ.1,700 కోట్ల లాటరీ తగిలిందని నాగమణికి ఓ పత్రాన్ని చూపించాడు. ఈ మొత్తం రావాలంటే పన్నుల రూపంలో రూ.15 కోట్లు చెల్లించాలని నమ్మించాడు. దీంతో ఆమె తన బ్యాంకు ఖాతాలో ఉన్న దాదాపు రూ.3 కోట్ల నగదును శివప్రసాద్, అతని అన్న చక్రవర్తి, వదిన హేమలత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. రూ.15 కోట్ల విలువ చేసే భూములు, రూ.10 కోట్ల విలువ చేసే భవనాన్ని విక్రయించి మొత్తం రూ.28 కోట్లు తీసుకున్నాడు శివప్రసాద్‌. ఇంత వరకు బాగానే ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ RBI నుంచి రావాల్సిన డబ్బు రావడం లేదని నాగమణి ప్రశ్నించింది. కానీ మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఓసారి గట్టిగా నిలదీయడంతో చంపేస్తానని బెదిరించాడు. అంతే కాదు గతేడాది డిసెంబరులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడ్ని వెతుక్కుంటూ బంగారుపాళ్యానికి వెళ్లిన నాగమణికి ఊహించని షాక్‌ తగిలింది. శివప్రసాద్‌ నాయుడికి భార్యతోపాటు 8 ఏళ్ల కూతురు ఉన్నారని తెలిసి విస్తుపోయింది. దీనిపై గట్టిగా నిలదీయడంతో అందరూ కలిసి ఆమెపై దాడిచేసి, చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు… పోలీసులు ఈ కేసుపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. నాగమణిని మోసం చేసిన శివప్రసాద్ నాయుడును విచారిస్తున్నారు..

Exit mobile version