NTV Telugu Site icon

Maharashtra: వాస్తుదోషాల పేరుతో మహిళపై పదేపదే అత్యాచారం..

Maharashtra

Maharashtra

Maharashtra: తప్పుడు మాటలు చెబుతూ, చేతబడులను, దోషాలను వదిలిస్తామంటూ కొందరు బాబాలు, మాంత్రికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వాస్తుదోషాలు, చెడు దోషాలు వదిలిస్తానని చెబుతూ 35 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా బాధితురాలి భర్త స్నేహితులే అని పోలీసులు వెల్లడించారు. మహిళ భర్తకు ఏదో చెడు శక్తి ఆవహించిందని, ఇవన్నీ తొలిగిపోవాలంటే కొన్ని ఆచారాలు చేయాలని వారు మహిళకు చెప్పారు. నిందితుడు ఏప్రిల్ 2018 నుంచి బాధితురాలి ఇంటికి తరుచూ వస్తున్నాడు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో కొన్ని పూజలు చేస్తాడు. పంచామృతం అని పిలిచే ఓ డ్రింక్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేసేవాడని పోలీసులు తెలిపారు.

Read Also: Anantnag Encounter: 5 రోజులుగా ఎన్‌కౌంటర్.. ఇంకా చిక్కని ఉగ్రవాదులు.. ఆర్మీకి సవాళ్లు..

భర్తకు నయం కావాలని, ప్రభుత్వం ఉద్యోగం దొరకాలని ఆ మహిళ, నిందితుడు చెప్పిందల్లా వినడమే కాకుండా బంగారం, డబ్బును కూడా ఇచ్చింది. 2019లో థానెలోని యూర్ ఫారెస్ట్ లో కందివాలిలో ప్రధాన నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. నిందితులంతా ఆమె దగ్గర నుంచి రూ. 2.1 లక్షలతో పాటు బంగారం తీసుకున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉండే తలసరి అనే ప్రాంతానికి చెందిన మహిళ సెప్టెంబర్ 11న ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులు రవీంద్ర భాటే, దిలీప్ గైక్వాడ్, గౌరవ్ సాల్వి, మహేంద్ర కుమావత్ , గణేష్ కదమ్‌లను అరెస్టు చేశారు.

అయితే, మహిళపై ఒక్కరే అత్యాచారం చేశారా..? నిందితులు ఐదుగురు ఈ దురాగతానికి ఒడికట్టారా..? అనే విషయాలను కనుగొనాల్సి ఉందని పోలీస్ అధికారి విజయ్ ముతాడక్ తెలిపారు. ఐదుగురిపై ఐపీసీ సెక్షన్లు 376 (రేప్) 376 (2) (n) (ఒకే మహిళపై పదేపదే అత్యాచారం చేయడం) 420 (మోసం) కింద అభియోగాలు మోపినట్లు పాల్ఘర్ ఎస్పీ బాలాసాహెబ్ పాటిల్ తెలిపారు.