Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరగింది. దళిత, వెనకబడిన తరగతులకు చెందిన ఇద్దరు యువకులను తప్పుడు ఆరోపణల్లో ఇరికించి దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. తప్పుడు లైంగిక ఆరోపణ మోపి దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మలం తినిపించి జుగుప్సాకరంగా వ్యవహరించారు. ఈ ఘటన రాష్ట్రంలోని శివపురిలో జరిగింది. స్థానికంగా ఉన్న మైనారిటీ కుటుంబం జాతవ్ కమ్యూనిటీకి చెందిన దళితుడు, కేవత్ కమ్యూనిటీకి చెందిన మరో యువకుడు ఇద్దరిని క్రూరంగా హింసించారని పోలీసులు తెలిపారు. శివపురిలోని నార్వార్ ప్రాంతంలోని వార్ఖాడిలో జూన్ 30న ఈ ఘటన జరిగింది.
ఇద్దరు యువకులను దారుణంగా కొట్టడంతో పాటు ముఖానికి నల్లరంగు పూసి, బలవంతంగా మలం తినిపించి, పట్టణంలో ఊరేగించారు. ఈ ఘటనపై బాధితుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న మైనారిటీ కుటుంబానికి చెందిన ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు యువకులపై మోపిన లైంగిక ఆరోపణలు నిరాధారమైనవిగా పోలీసులు తేల్చారు. ఆస్తికి సంబంధించిన వివాదంతో ఈ దాడికి తెగబడ్డారని.. దాడి చేసిన వారు తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Rare Brain Infection: కేరళలో అత్యంత అరుదైన అమీబా ఇన్ఫెక్షన్ కేసు.. మెదడును ప్రభావితం చేసే వ్యాధి..
ఇద్దరు వ్యక్తులపై హింస, దాడిని ‘‘ మానవత్వం సిగ్గుపడే తాలిబానీ చర్య’’గా రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని, ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) ప్రయోగించి, అక్రమంగా నిర్మించిన వారి ఆస్తుల్ని కూల్చేయాలని శివపురిలోని స్థానిక పరిపాలకు ఆదేశాలు జారీ చేసినట్లు నరోత్తమ్ మిశ్రా చెప్పారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని.. కాంగ్రెస్ నేతలు అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి తీసుకురావడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు.
మధ్యప్రదేశ్ లో ఓ ఆదివాసీ వ్యక్తిపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన కొద్ది రోజలకే ఈ సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం బాధితుడి పాదాలు కడిగారు. ఈ సంఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ అతడికి క్షమాపణలు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి ఇంటిని బుల్డోజర్ తో కూల్చేశారు. పేదలకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.