Digital Arrest Scam: కృష్ణాజిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నానికి చెందిన వృద్ధ దంపతులు అలివేలు, మంగమ్మలను ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయభ్రాంతులకు గురిచేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.43 కోట్లు కాజేశారు. ఢిల్లీ నుంచి మాట్లాడుతున్న అధికారులమంటూ ఫోన్ చేసిన కేటుగాళ్లు, రూ.587 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో ఉపయోగించిన బ్యాంక్ కార్డుతో వారి ఖాతాకు సంబంధం ఉందని నమ్మించారు. అంతేకాకుండా బాధితులపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే వెంటనే డబ్బులు బదిలీ చేయాలని బెదిరించారు. వారి మాటలను నిజమని నమ్మిన వృద్ధ దంపతులు జూలై 10 నుంచి జూలై 29 మధ్య మూడు దఫాలుగా తమ మూడు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.1.43 కోట్లు బదిలీ చేశారు.
డబ్బులు తీసుకున్న తర్వాత కూడా సైబర్ నేరగాళ్లు ఆగలేదు. మరో రూ.95 లక్షలు పంపించాలని ఒత్తిడి చేస్తూ, అవసరమైతే ఇంట్లో ఉన్న బంగారం, వెండి తాకట్టు పెట్టి అయినా డబ్బులు చెల్లించాలని బెదిరించారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు తమకు తెలిసిన వారికి విషయం చెప్పగా, ఇది సైబర్ మోసమని గుర్తించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు డబ్బు బదిలీ అయిన ఖాతాలు, కాల్ వివరాలు, సైబర్ నేరగాళ్ల జాడపై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వచ్చే కాల్స్, వీడియో కాల్స్ లేదా డబ్బు బదిలీ చేయాలన్న ఆదేశాలను ప్రజలు నమ్మొద్దని, అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

