Site icon NTV Telugu

Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్‌..!

Blast

Blast

Bomb Blast : కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం బాంబు కలకలం సృష్టించింది. మొదటి ప్లాట్‌ఫామ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన నల్లటి సంచిలో ఉన్న నాటు బాంబు పేలడంతో ఒక వీధి కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఉదయం వేళ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్‌ఫామ్ పక్కన రైల్వే ట్రాక్‌పై ఉంచిన నల్లటి సంచిని ఒక వీధి కుక్క ఆహారంగా భావించి తినే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆ సంచిలోని బాంబు భారీ శబ్దంతో పేలింది. ఈ పేలుడు ధాటికి ఆ కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే స్టేషన్‌లో హఠాత్తుగా భారీ శబ్దం రావడంతో అక్కడున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో వారు పరుగులు తీశారు. వెంటనే తేరుకున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు.

Rupee Falls: దారుణం.. రికార్డు కనిష్టానికి చేరిన రూపాయి విలువ.. డాలర్‌తో పోలిస్తే రూ.90 పైనే..!

ప్రయాణికుల సమాచారంతో రంగంలోకి దిగిన మూడవ పట్టణ పోలీసులు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాంబు పేలుడుపై కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా, రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఇంకా ఏమైనా ప్రమాదకర వస్తువులు లేదా బాంబులు ఉన్నాయేమోనని పోలీసులు జాగీలాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆ ప్రాంతంలో మరో ఐదు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నాటు బాంబులను రైల్వే స్టేషన్‌లో ఎందుకు పెట్టారు, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, రైల్వే స్టేషన్‌లో భద్రతను పర్యవేక్షిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Exit mobile version