Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి

Korukonda Tragedy

Korukonda Tragedy

Korukonda Tragedy: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో వినాయక చవితి పర్వదినం విషాదాన్ని నింపింది. గానుగూడెం గ్రామానికి చెందిన గొనిపాటి శివ (38), సోడదాసి వీరబాబు (35) వినాయక చవితి పూజ కోసం కలువ పువ్వులు సేకరించేందుకు గ్రామ చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తూ లోతైన ప్రాంతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు గమనించి సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే వారు మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను కోరుకొండ ఎస్‌ఐ ఆర్. శివాజీ వెల్లడించారు. మృతుడు శివకు భార్యతో పాటు నలుగురు పిల్లలు ఉండగా, వీరబాబు తన వృద్ధ తల్లిదండ్రులకు ఆధారంగా జీవిస్తున్నాడు. ఇద్దరి ఆకస్మిక మృతితో తూర్పుగానుగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వినాయక చవితి పూజ కోసం పూలు తీసుకురావడానికి వెళ్లిన ఇద్దరూ తిరిగి రాకపోవడంతో తూర్పుగానుగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగ వేళ జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.