Physical Harrasment : ప్రముఖ విద్యాసంస్థ జేఎన్టీయూ (JNTU)లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఒక మహిళపై అక్కడే పనిచేస్తున్న ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యాసంస్థలోనే ఉద్యోగ సంబంధాల పేరుతో ప్రారంభమైన వేధింపులు, తర్వాత మానసిక బెదిరింపులు, చివరికి అత్యాచారానికి దారి తీసిన విధానం ఇప్పుడు వెలుగులోకి రావడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఒకే సామాజిక వర్గానికి చెందినవారమని నమ్మకాన్ని పెంచుతూ, తనపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించిన ప్రొఫెసర్, ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. వర్క్ ఉందని చెప్పి అర్ధరాత్రి వరకు క్యాంపస్‌లోనే తన దగ్గర ఉంచడం ద్వారా ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా దెబ్బతీశాడని వివరించింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో బాధితురాలి దాంపత్య జీవితం తీవ్రంగా దెబ్బతిందని తెలుస్తోంది. అకస్మాత్తుగా రాత్రివేళల పని, ప్రొఫెసర్‌తో ఎక్కువ సమయం గడపాల్సి రావడం వల్ల ఆమె కుటుంబంలో విభేదాలు పెరిగి, చివరకు భార్యాభర్తలు వేరువేరు ఉండే స్థితికి చేరుకున్నారు. ఈ ఒంటరితనాన్ని కూడా ప్రొఫెసర్ అవకాశంగా మలుచుకుని, ఆమెపై శారీరకంగా, మానసికంగా మరింత ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు బాధిత మహిళ ఆరోపించింది.
బాధితురాలు పేర్కొన్న అత్యంత షాకింగ్ అంశం.. ప్రొఫెసర్ తన ఛాంబర్‌లోకే తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన. ఈ అనూహ్య దాడితో ఆమె తీవ్ర మానసిక ఆందోళనకు గురై, రోజురోజుకీ పెరుగుతున్న వేధింపులు తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఫిర్యాదుతో వెంటనే స్పందించిన కేపీహెచ్‌బీ పోలీసులు నిందిత ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
