Site icon NTV Telugu

Jagtial: ప్రాణం తీసిన ప్రేమ.. యువకుడిని కొట్టి చంపిన ప్రియురాలి కుటుంబీకులు..!

Crime1

Crime1

Jagtial: తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఎదురుగట్ల సతీష్ అనే యువకుడు.. డ్రైవర్‌గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ యువకుడిని దారుణంగా కర్రలతో కొట్టి చంపేశారు. అయితే సతీష్‌కు.. రేచపల్లిలోనే నివసించే ఒక యువతితో గత కొన్ని నెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆ ప్రేమ వ్యవహారమే సతీష్ హత్యకు కారణంగా తెలుస్తోంది.. వారిద్దరి ప్రేమను యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పైగా వివాహం ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి.. సతీష్‌తో సంబంధాన్ని ముగించమని ఆమెకు సూచించారు. దీంతో యువతి సతీష్‌కు తన నిర్ణయాన్ని తెలిపింది. దీనిపై కోపంతో సతీష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు.

READ MORE: Off The Record: మంత్రి రాజనర్సింహ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

“నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఎవరూ ఆమెను వివాహం చేసుకోకూడదు” అని ప్రకటించాడు. అంతేకాకుండా, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, యువతి ఫోటోలను గ్రామంలోని వాట్సాప్ గ్రూపుల్లో పంచడం వంటి చర్యలు చేశాడు. ఇవి యువతి బంధువులకు తీవ్రంగా కోపం తెప్పించాయి. యువతి తల్లిదండ్రులు, బంధువులు సతీష్‌ను పలుమార్లు హెచ్చరించారు. “ఇలాంటి చర్యలు ఆపేయి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు” అని చెప్పి, అతని తీరును మార్చుకోమని సూచించారు. కానీ సతీష్ ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. మరింత ధైర్యంగా పోస్టులు కొనసాగించాడు…

READ MORE: Chennai Accident: చెన్నైలో ఘోరం.. తొమ్మిది మంది మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు

ఈ క్రమంలో యువతి బంధువులు.. సతీష్‌ను ఇంటికి పిలిపించారు. తొలుత ఘర్షణ పడ్డారు. అది కాస్తా ముదరడంతో హత్యకు దారి తీసింది. కోపంతో యువతి తల్లిదండ్రులు, ఇతర బంధువులు సతీష్‌పై కర్రలు, చెక్కలతో కొట్టారు. తీవ్ర గాయాలతో సతీష్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. సతీష్ శవాన్ని పోస్ట్‌మార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పోలీసుల దర్యాప్తులో నలుగురు నిందితులను గుర్తించారు. హత్యకు పాల్పడినందుకు ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు..

Exit mobile version