హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణ హత్య చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రౌడీ షీటర్ రోషన్ సింగ్ (25)ను మరో రౌడీషీటర్ బాలశౌ రెడ్డి, అతని అనుచరులు ఆదిల్, మహమ్మద్‌లు కలిసి కత్తులతో దారుణంగా నరికి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు బులెట్ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. సుమారు 15 రోజుల క్రితం రోషన్ సింగ్, మరో ఆరుగురు మిత్రులు కలిసి జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ ట్రాన్స్‌జెండర్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై బాధితుడు బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
అయితే ట్రాన్స్‌జెండర్‌పై అత్యాచార కేసులో తాము చిక్కుకున్నామనే ఆగ్రహంతో రోషన్ సింగ్, తన స్నేహితుల మధ్య డబ్బు చెల్లింపుపై గొడవలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో బాలశౌ రెడ్డి, ట్రాన్స్‌జెండర్‌ను కేసు పెట్టమని ఉసిగొల్పాడని రోషన్ సింగ్ అనుమానించాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. చివరికి రోషన్ సింగ్‌ను హత్య చేయాలన్న ఉద్దేశంతో బాలశౌ రెడ్డి, ఆదిల్, మహమ్మద్‌లు బుధవారం జగద్గిరిగుట్ట బస్టాండు వద్దకు చేరుకున్నారు.
వీరిమధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయగా మహమ్మద్ వెనకనుంచి రోషన్ సింగ్‌ను పట్టుకోగా, బాలశౌ రెడ్డి కత్తితో దారుణంగా పొడిచాడు. అనంతరం ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన రోషన్ సింగ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు రోషన్ సింగ్, నిందితులు బాలశౌ రెడ్డి, ఆదిల్, మహమ్మద్‌లపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ముగ్గురినీ రిమాండుకు తరలించినట్లు మేడ్చల్ ఇన్‌చార్జ్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.
YS Jagan: వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ..!
