Illegal Affair : వివాహేతర సంబంధం ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే కాకుండా, కట్టుకున్న భర్త ప్రాణాలను బలిగొనేలా చేసింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అశోక్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టగా దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు బయటపడ్డాయి. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య పూర్ణిమ, తన ప్రియుడు మహేష్‌తో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది.
పోలీసుల కథనం ప్రకారం.. అశోక్, పూర్ణిమ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, వీరి ఇంటి పక్కనే అద్దెకు ఉండే 25 ఏళ్ల యువకుడు మహేష్‌తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త అశోక్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తన తీరు మార్చుకోవాలని అశోక్ భార్యను పలుమార్లు హెచ్చరించాడు. దీనిని మనసులో పెట్టుకున్న పూర్ణిమ, తన ప్రియుడితో కలిసి భర్తను వదిలించుకోవాలని పథకం రచించింది.
పథకం ప్రకారం.. పూర్ణిమ, మహేష్ కలిసి అశోక్‌పై దాడి చేశారు. అనంతరం మూడు చున్నీలను అశోక్ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హాల్‌లో హత్య చేసిన తర్వాత, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పై అంతస్తులోని బెడ్ రూమ్‌కు చేర్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా అశోక్ సోదరికి ఫోన్ చేసి, అశోక్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, స్పృహ లేకుండా పడిపోయాడని నమ్మబలికారు.
Sridhar Babu : మేము ‘హైప్’ చేయడం లేదు.. నిరుద్యోగుల్లో ‘హోప్’ క్రియేట్ చేస్తున్నాం
అశోక్ సోదరి వచ్చి చూసేసరికి అశోక్ అచేతనంగా పడి ఉన్నాడు. ఒంటిపై గాయాలు ఉండటంతో ఆమె ప్రశ్నించగా, బాత్‌రూమ్‌లో కింద పడటం వల్ల ఆ దెబ్బలు తగిలాయని పూర్ణిమ అబద్ధం చెప్పింది. మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా ఉండేందుకు పూర్ణిమ, మహేష్ గట్టిగా ప్రయత్నించారు. ఆసుపత్రి వద్దకు మహేష్ కూడా వచ్చి పోస్టుమార్టం అవసరం లేదని కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశాడు.
వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులో అది ‘హత్య’ అని తేలడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానంతో భార్య పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. మహేష్‌తో కలిసి తానే హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, అశోక్ చనిపోయిన పది రోజుల పాటు పూర్ణిమ ఇంట్లో ఏమీ తెలియనట్లుగా నటిస్తూ దశదిన కర్మలు నిర్వహించింది. ఈ పది రోజుల్లోనూ ఆమె రహస్యంగా తన ప్రియుడు మహేష్‌తో చాటింగ్ చేయడమే కాకుండా, మూడు రోజుల క్రితం అతనితో కలిసి షాపింగ్‌కు కూడా వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
