హైదరాబాద్ నగరంలో డ్రంక్ డ్రైవింగ్ ఘటనలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. పోలీసుల కఠిన తనిఖీలు, భారీ జరిమానాలు, రెగ్యులర్ కౌన్సిలింగ్ ఉన్నప్పటికీ, మద్యం సేవించి వాహనాలు నడిపే యువత దుశ్చర్యలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది.
యాచారం అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఒక కారు వేగంగా వచ్చి తనిఖీల్లో ఉన్న ఎస్సైపై నేరుగా దూసుకెళ్లింది. ఢీకొన్న వేగానికి ఎస్సై కారు బానెట్‌పై పడిపోయాడు. అయితే షాక్‌కు గురైన ఎస్సైను బానెట్‌పై పెట్టుకుని కారు ఆగకుండా కొనసాగడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కారు కొంతదూరంలో వేగం తగ్గడంతో ఎస్సై దూకి బయట పడగా అతనికి స్వల్ప గాయాలయినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో ఆగని డ్రైవర్, ముందుకు వెళ్తూ మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో ప్రజలు ఆగ్రహంతో కేకలు వేయగా, పోలీసులు వెంటనే కారు వెంబడి వెళ్లి ఆపడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఖానాపూర్ పోలీసులు ఇంటర్‌సెప్ట్ చేసి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారులో మరొక వ్యక్తి కూడా ఉండగా, ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.
