Site icon NTV Telugu

Priest : పూజకు పిలిచిన మోసగాళ్లు.. పురోహితుడి జేబే ఖాళీ చేశారు.!

Priest

Priest

Priest : హైదరాబాద్ నగరంలో మరోసారి సైబర్ మోసం వెలుగుచూసింది. 52 ఏళ్ల వయసు గల ఓ పురోహితుడు నేరగాళ్లకు బలై, లక్షల రూపాయలు కోల్పోయాడు. పాతబస్తీ పురానాపూల్ ప్రాంతానికి చెందిన ఈ పురోహితుడిని సైబర్ దుండగులు పూజ పేరుతో మోసం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే… సికింద్రాబాద్ మిలిటరీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ కొందరు మోసగాళ్లు ఆ పురోహితుడికి ఫోన్ చేశారు. “మా కల్నల్ సర్ ఆరోగ్యం బాగోలేదు. ఆయన కోసం 11 రోజులపాటు ప్రత్యేక పూజ చేయాలి. దానికి 21 మంది పురోహితులు అవసరం. ఈ పూజకు అడ్వాన్స్‌గా రూ.3 లక్షలు ఇస్తాం” అని చెప్పి నమ్మించారు. మొదట నమ్మకాన్ని కలిగించేందుకు ఆయన ఖాతాలో రూ.10 పంపించారు.

BCCI-Dream 11: డ్రీమ్‌ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు.. ఐపీఎల్‌కూ రాంరాం!

తరువాత వీడియో కాల్ చేసి, మిగతా మొత్తం పంపుతామని చెప్పి మోసగాళ్లు జాగ్రత్తగా పురోహితుడి డెబిట్ కార్డు నంబర్, పిన్ వంటి ముఖ్యమైన వివరాలు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి విడతల వారీగా మొత్తంగా రూ.5.99 లక్షలు కాజేశారు. కొద్ది గంటలకే తన ఖాతాలోని మొత్తం డబ్బు గల్లంతైనట్లు గుర్తించిన పురోహితుడు సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించారు. తక్షణమే ఆయన సైబర్ మోసాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నేరగాళ్ల ఫోన్ నంబర్లు, లావాదేవీల వివరాలను సేకరించి వారి జాడ కోసం శోధిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ… అనుమానాస్పద ఫోన్ కాల్స్, పూజలు లేదా ఇతర ఆఫర్ల పేరుతో వచ్చే డబ్బు డిమాండ్లను నమ్మొద్దని సూచించారు. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా నంబర్లు, కార్డు వివరాలు, పిన్ వంటి గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మొత్తానికి, పూజ పేరుతో నమ్మబలికి 52 ఏళ్ల పురోహితుడిని మోసగాళ్లు దాదాపు రూ.6 లక్షలు కాజేయగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Budda Rajasekhar Reddy: దాడి చేశానని నిరూపిస్తే బహిరంగంగా మోకాళ్లపై కూర్చొని క్షమాపణ చెప్పేందుకు సిద్ధం

Exit mobile version