వ్యాపారంలో పోటీ ఉండాలి. అది ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. కానీ కొంత మంది తమ పోటీ వ్యాపారస్తులను శత్రువులుగా చూస్తున్నారు. అది ఒక స్థాయి వరకు ఉంటే ఫర్వాలేదు.. కానీ వారిని చంపేంత వరకు కక్ష పెట్టుకుంటున్నారు. సరిగ్గా ఇదే రీతిలో హైదరాబాద్ లోని మియాపూర్ లో ఓ మర్డర్ జరిగింది. ఆటోలతో ట్రాన్స్ పోర్టు వ్యాపారం చేసేవారు.. కొంత మంది తమ వాహనాల వెనుక ‘ నన్ను చూసి ఏడవకురా.. అప్పు చేసి కొన్నా’ అని రాసి పెట్టుకుని ఉంటారు.. ఇది మనం గమనించే ఉంటాం. అంటే మిగతా పోటీ వ్యాపారులు తమపై నిఘా పెట్టవద్దని అనేది వారి అభిమతంగా ఉంటుంది. నిజానికి వ్యాపారంలో పోటీ ఉంటేనే మంచిది. అది ఆరోగ్యకరమైన పోటీ అయితే.. ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ కొంత మంది వ్యాపారులు.. తమ తోటి వ్యాపారులను శత్రువులుగానే భావిస్తున్నారు. పైగా వారితో ఆగర్భ శత్రుత్వంతో రగిలిపోతున్నారు..
కొన్నిసార్లు పోటీ వ్యాపారులను చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్ మియాపూర్ లో జరిగింది. ఇక్కడ చూడండి.. ఈ వ్యక్తి పేరు శ్రీనివాస్. వనపర్తి జిల్లా జంగమయ్యపల్లి ఆయన స్వస్థలం. హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటి నిర్మాణాలకు ఉపయోగించే కట్టెల వ్యాపారం చేస్తున్నాడు. చాలా ఏళ్ల నుంచి సొంతంగా కష్టపడుతూ.. వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసుకున్నాడు. కానీ అతని వ్యాపారంపై కొంత మంది పోటీవ్యాపారుల కన్ను పడింది..
శ్రీనివాస్ వ్యాపారం చేస్తున్న దుకాణం సమీపంలోనే సొహేల్‌తోపాటు మరో ముగ్గురు కూడా ఇదే కట్టెల వ్యాపారం చేస్తున్నారు. వారు శ్రీనివాస్‌పై కక్ష పెంచుకున్నారు. వ్యాపారంలో తమ కంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నాడు అనే దుగ్ధ ఉంది. రోజూ సూటి పోటి మాటలు అనడం కూడా జరుగుతుండేది. ఇలాంటి చిన్న చిన్న వివాదాలు కాస్తా పెద్దవి అయ్యాయి. ఇదే క్రమంలో ఆదివారం కూడా గొడవ జరిగింది. మధ్యాహ్నం శ్రీనివాస్ తన షాపులో ఉండగా.. సోహేల్ తోపాటు మరో ముగ్గురు గొడవకు దిగారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నావని గొడవ పడ్డారు. అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నలుగురు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
అటు శ్రీనివాస్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సోహేల్‌తోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.