KPHB Incident: కేపీహెచ్‌బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..

Kphb

Kphb

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో గుండెలను పిండేసే తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపి, సమత దంపతులు ఆర్థిక కష్టాల సుడిగుండంలో చిక్కుకుని, తమ రెండేళ్ల చిన్నారి స్నిగ్ధతో సహా ప్రాణాలు తీసుకున్నారు. కొంతకాలంగా రోజువారీ అవసరాలు తీరక, చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక వారు తీవ్ర మానసిక క్షోభ అనుభవించారు.

తాము చనిపోతే రెండేళ్ల పసికందు అనాథగా మారి కష్టాలు పడుతుందనే బెంగతో, ముందుగా చిన్నారి స్నిగ్ధను ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత దంపతులిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు వారు తమ ఇంటి గోడపై “మా చావుకు ఎవరూ కారణం కాదు, ఈ విషయంలో వేరే ఎవరినీ ఎటువంటి వివరాలు అడగవద్దు. ఇది చాలా కాలం క్రితం మేమిద్దరం కలిసి బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మేము తప్పు చేస్తున్నామని తెలుసు, కానీ మాకు వేరే మార్గం లేదు, దయచేసి మమ్మల్ని క్షమించండి” అని ఆవేదనతో రాశారు.

ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో స్థానికులు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా, చిన్నారి విగతజీవిగా పడి ఉండగా, దంపతులు వేలాడుతూ కనిపించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.