Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!

Arrest

Arrest

నగరంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న స్థావరంపై హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ జోన్), స్థానిక గోల్కొండ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళా నిర్వాహకురాళ్లతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకోగా, ఓ బాధితురాలికి పోలీసులు విముక్తి కల్పించారు.

డబ్బు ఆశ చూపి ఉచ్చులోకి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ మహమ్మద్ నగర్, కటోరా హౌస్ ప్రాంతానికి చెందిన ఫర్హా బేగం (32), ఆరాంఘర్‌కు చెందిన ఫర్హీన్ (25) అనే ఇద్దరు మహిళలు ముఠాగా ఏర్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక మహిళలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించి నగరానికి రప్పించేవారు. గోల్కొండ పరిధిలో నివాస వసతి ఏర్పాటు చేసి, విటులను ఆకర్షిస్తూ వారి ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారు.

టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి.. ముగ్గురు అరెస్ట్
ఈ అక్రమ కార్యకలాపాలపై పక్కా సమాచారం అందుకున్న గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం, స్థానిక పోలీసులతో కలిసి సదరు అడ్డాపై ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధాన నిర్వాహకురాలు ఫర్హా బేగం, సహ-నిర్వాహకురాలు ఫర్హీన్‌లతో పాటు అక్కడే ఉన్న విటుడు ఫయాజ్ ఆలం (32, వెల్డర్, కొండాపూర్ నివాసి)ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడ చిక్కుకున్న ఓ బాధితురాలిని సురక్షితంగా రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. ఘటనా స్థలం నుంచి 4 మొబైల్ ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

కేసు నమోదు.. విచారణ ముమ్మరం
ఈ ఘటనపై గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 406/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 143(2), 144(2) తో పాటు పిటా (PITA) చట్టం సెక్షన్లు 3, 4, 5 ల కింద కేసులు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎమ్. మహేష్ పర్యవేక్షణలో ఎస్సై వి. శ్రీనివాస్, గోల్కొండ పోలీస్ సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. నగరంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.