Site icon NTV Telugu

Cyber Fruad: సైబర్ కేటుగాళ్లు చేస్తున్న అరాచకాలకు అంతే లేదు

Cyber Fraud

Cyber Fraud

Cyber Fruad: సైబర్ క్రిమినల్స్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించడంతో.. వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. తన తల్లి మృతికి సైబర్ నేరగాళ్లే కారణమని.. కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అమాయకులు, వృద్ధులు, మహిళలు.. ఇలా ఎవరు దొరికినా.. అందినకాడికి దోచుకుంటున్నారు. కేవలం ఒక్క ఫోన్ కాల్‌తో లక్షల రూపాయలు స్మార్ట్‌గా కొట్టేస్తున్నారు. కానీ ఒక్కోసారి వారు చేస్తున్న అరాచకాల వల్ల వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్‌‌లో సరిగ్గా ఇలాగే జరిగింది…

హైదరాబాద్‌లో ఉంటున్న ఓ మహిళా డాక్టర్.. వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లోనే ఉంటోంది. కొడుకు, కోడళ్లు, మనవళ్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఐతే ఒంటరిగా ఉంటున్న ఆమెకు సైబర్ కేటుగాళ్లు కాల్ చేశారు. వీడియో కాల్ ద్వారా.. తమను తాము పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. అంతే కాదు ఆమెపై మనీలాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయయ్యాని బెదిరించారు. ఆమెను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు వీడియో కాల్‌లోనే చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో మా వాళ్లు వచ్చి అరెస్ట్ చేస్తారని తెలిపారు..

ఇలా ఆమెను మూడు రోజులపాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు సైబర్ క్రిమినల్స్. చివరకు తాము చెప్పిన విధంగా చేస్తే.. మీకు డిజిటల్ అరెస్ట్ నుంచి విముక్తి కల్పిస్తామని నమ్మబలికారు. ఆమె అది నమ్మడంతో తాము చెప్పిన విధంగా డబ్బులు చెల్లించాలని హుకుం జారీ చేశారు. వారు చెప్పిన అకౌంట్లకు డబ్బులు పంపించాలని చెప్పారు. ఈ మేరకు ఆమె.. వారు చెప్పిన అకౌంట్లకు 6 లక్షల 50వేల రూపాయలు పంపించింది. కానీ ఆ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా సైబర్ క్రిమినల్స్ వేధింపులు ఆపలేదు. మళ్లీ మళ్లీ డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు. ఇంకా డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది…

తల్లి మృతి విషయం తెలుసుకున్న కొడుకు.. హైదరాబాద్‌కు వచ్చి.. అసలు ఏం జరిగిందని ఆరా తీశాడు. దీంతో సైబర్ క్రిమినల్స్‌ అకౌంట్లకు డబ్బులు పంపిన విషయం బయటపడింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన తల్లి మృతికి సైబర్ చీటర్సే కారణమని ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని.. అలా ఎవరు చెప్పినా కచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనే అయి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సో బీ అలర్ట్.. డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా కాల్ చేసి చెప్తే.. వెంటనే కాల్ కట్ చేయండి…

Exit mobile version