BE ALERT: అప్పు తీర్చలేదని 21 రోజుల పసికందు కిడ్నాప్.. రెండు గంటల్లోనే తల్లి చెంతకు

  • మంజుల వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకున్న అనిత
  • అనిత ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగిన మంజుల
  • 21 రోజుల పసిబాబును తీసుకెళ్లిన మంజుల మనుషులు
Crime

Crime

హైదరాబాద్ శివారులో అమానుష ఘటన వెలుగు చూసింది. తీసుకున్న అప్పు తీర్చలేదని పసికందుకు ఎత్తుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది? 21 రోజుల పసిబాబు అని కూడా చూడకుండా కొంత మంది ప్రవర్తించారు. బాబును ఇంటి నుంచి ఎత్తుకెళ్లడంతో కన్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. పోలీసులు వేగంగా స్పందించి రెండు గంటల్లోనే బాబును గుర్తించి తల్లి వద్దకు చేర్చారు.

హనుమాన్ నగర్‌కు చెందిన అనిత, ఆమె భర్త రాఘవేందర్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం హఫీజ్‌పేట్‌లో ఇంటి పక్కన నివసించే మంజుల అనే మహిళ వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. అప్పు తిరిగి చెల్లించే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అనిత ఇంటికి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కలిసి ఆటోలో ఇంట్లో ఉన్న 21 రోజుల పసిబాబును తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తన బిడ్డను తీసుకెళ్లొద్దంటూ అనిత వారి కాళ్లపై పడి వేడుకున్నప్పటికీ.. ఆమెను పక్కకు నెట్టివేసి బాబును తీసుకెళ్లారని ఆరోపించింది.పసిబాబును తీసుకెళ్లిన విషయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాబును ఎక్కడికి తీసుకెళ్లారనే వివరాలపై ఆరా తీసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు, స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. దాదాపు రెండు గంటల్లోనే బాబును గుర్తించిన పోలీసులు.. అతడిని తిరిగి తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

అప్పు విషయంలో వివాదం ఉన్నప్పటికీ పసిబిడ్డను ఇలా తీసుకెళ్లడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పసిబిడ్డను బలవంతంగా తీసుకెళ్లిన ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కేవలం అప్పు వివాదం కారణంగా 21 రోజుల పసిబిడ్డను తీసుకెళ్లడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.