Tragedy : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గుండెలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా, చికిత్స కోసం వచ్చిన ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మంచినీళ్లు అనుకొని పొరపాటున లాబరేటరీ కెమికల్ తాగడంతో 19 ఏళ్ల యువకుడు మరణించిన ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన గణేష్ అనే యువకుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న గణేష్‌ను చికిత్స నిమిత్తం అతని తల్లి మిర్యాలగూడలోని కృష్ణ సాయి హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో వేచి ఉన్న సమయంలో గణేష్‌కు విపరీతంగా దాహం వేయడంతో, అక్కడ అందుబాటులో ఉన్న ఒక క్యాన్‌ను చూసి అతని తల్లి అది మంచినీళ్లేనని భావించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ క్యాన్‌లో ఉంది మంచినీళ్లు కావు, లాబరేటరీ పరీక్షల కోసం వినియోగించే అత్యంత ప్రమాదకరమైన కెమికల్ లిక్విడ్.
Mahabubabad: తల్లి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో.. కొడుకు షాకింగ్ డెసిషన్
ఏమాత్రం అనుమానం కలగని తల్లి, ఆ లిక్విడ్‌ను కుమారుడికి తాగించింది. అది తాగిన కొద్దిసేపటికే గణేష్ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమించడంతో ఆ యువకుడు మృతి చెందాడు. ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రిలోనే, యాజమాన్యం చేసిన చిన్న పొరపాటు ఒక కుటుంబంలో తీరని చీకట్లు నింపింది. విషపూరితమైన కెమికల్స్ ఉన్న డబ్బాలను రోగులకు అందుబాటులో ఉంచడం, వాటిపై ఎటువంటి హెచ్చరిక గుర్తులు లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
తమ కళ్ల ముందే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో గణేష్ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుతాడనుకున్న కొడుకు, జ్వరం తగ్గించుకోవడానికి వచ్చి ఇలా శవమై పడి ఉండటాన్ని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో చిన్న అనుముల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Sweet Potatoes: డయాబెటిస్ స్వీట్ పోటాటో తినొచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే..
