Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.

  • గుజరాత్‌లోొ పరువు హత్య..
  • వేరే కులం వ్యక్తిని ప్రేమించినందుకు కుమార్తె హత్య..
Honour Killing

Honour Killing

Honour Killing: గుజరాత్‌లో ‘‘పరువు హత్య’’ సంచలనంగా మారింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిన కారణంగా, కన్న కూతురినే తండ్రి దారుణంగా హత్య చేశాడు. రాష్ట్రంలోని ఆనంద్ జిల్లా ఖంభట్ తాలూకా మెట్‌పూర్‌‌లో ఈ విషాద సంఘటన జరిగింది. దీపావళి రోజు రాత్రి కుమార్తెతో వాగ్వాదం తర్వాత ఆమె దుపట్టాతో గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత సహజ మరణం లేదా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మెట్‌పూర్ గ్రామానికి చెందిన కౌశల్‌కుమార్ పటేల్‌కు సాన్యా పటేల్ అనే 21 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె ఆ కుటుంబానికి ఏకైక సంతానం. సాన్యా వడోదరలో బీకామ్ పూర్తి చేసింది. ఏడాది కాలంగా గ్రామంలోని వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉంది. వీరిద్దరి కులాలు వేరు కావడంతో తండ్రి ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. యువకుడితో మాట్లాడటం మానుకోవాలని పలుమార్లు కుమార్తెను హెచ్చరించారు. అయినప్పటికీ కుమార్తె తండ్రి మాట వినకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

దీపావళి రాత్రి కుటుంబ అంతా ఇంట్లోనే ఉన్నారు. రాత్రి సమయంలో కుటుంబం నిద్రపోతున్న సమయంలో, తండ్రీకూతుళ్లు వంటగదిలో మాట్లాడుకున్నారు. యువకుడితో ప్రేమ బంధాన్ని తెంచుకోవాలని తండ్రి కుమార్తెను మరోసారి అభ్యర్థించారు. దీనికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన కౌశల్ కుమార్ దుపట్టాతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.