Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!

  • నమ్మకస్థురాలే రక్తం పారించింది
  • వివాహేతర సంబంధాన్ని మానుకోమనడమే శాపమైంది
  • వీడిన కృష్ణా జిల్లా గన్నవరం మర్డర్ మిస్టరీ
Vijayawada

Vijayawada

ఇంటి పక్కనే నమ్మకంగా ఉన్నారు.. పొరుగు వారే కదా..!! అని నమ్మి ఇంట్లోకి రానిస్తే.. ఆ వృద్ధురాలినే హత్య చేశారు. డబ్బులు అప్పు అడిగితే ఇవ్వలేదన్న కారణం ఒకటైతే.. తన వివాహేతర బంధానికి అడ్డు వస్తోందనే కారణం మరొకటి. మొత్తంగా ఆ వృద్ధురాలిని.. కన్న కొడుకుతో కలిసి మరీ చంపేసింది ఓ మహిళ. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో కలకలం సృష్టించింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వృద్ధురాలి పేరు కాజ రజిత కుమారి. కృష్ణా జిల్లా గన్నవరం దావాజీ గూడెం రోడ్డులోని జీఆర్కే ప్యారడైజ్ భవనంలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె భర్త చనిపోగా ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. రజిత శ్రీనగర్ కాలనీలో పిండి మర నడుపు కొంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే కాలనీలో నివాసం ఉండే పోలవరపు సుష్మ, ఆమె కుమారుడు పోలవరపు అజయ్ కొంతకాలంగా రజిత వద్ద అప్పులు తీసుకొని చిట్టీలు కడుతూ సన్నిహితంగా ఉండేవారు. సుష్మ, ఆమె కుమారుడు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని అప్పుగా డబ్బులు కావాలని కొంతకాలంగా రజితను అడిగారు. రజిత ఇస్తానని చెబుతూ పదే పదే మాటదాటేస్తూ వచ్చింది.

×
×
Ad

మరోవైపు.. గన్నవరానికి చెందిన ఓ న్యాయవాదితో సుష్మకు వివాహేతర సంబంధం ఉంది. ఐతే ఈ విషయం తెలిసిన రజిత.. అది మంచిది కాదని.. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ అదే ఆమె పాలిట శాపమైంది. రజిత.. ఆ న్యాయవాదిని సైతం హెచ్చరించింది. ఈ కారణంగా అతడు సుష్మకు దూరంగా ఉంటున్నాడనే అపోహతో ఆమెను హత్య చేయాలని సుష్మ ప్లాన్ చేసింది. ఇందుకోసం కొడుకు సాయం తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే మే 24న రాత్రి 11 గంటల సమయంలో రజిత.. అమెరికాలో ఉన్న తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడుతుండగా ఎవరో కాలింగ్ బెల్ కొట్టారని ఫోన్ కట్ చేశారు. అనంతరం కూతురు తిరిగి ఫోన్ చేస్తే కలవలేదు. ఉదయాన్నే పని మనిషి వచ్చి చూస్తే బెడ్ రూమ్‌లో రజిత రక్తపు మడుగులో మృతి చెంది కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమార్తె, బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

రజిత మృతదేహం పైన పలు గాయాలు కనిపించాయి. అదీ కాకుండా.. ఇంట్లోని బంగారం, నగదు కనిపించలేదని పోలీసులు గుర్తించారు. అపార్ట్ మెంట్ సీసీ కెమెరాలు పరిశీలిస్తే సుష్మ, ఆమె కుమారుడు అజయ్ ప్లాట్లోకి వచ్చినట్లు కనిపించింది. దీంతో ఇద్దరినీ పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. వాళ్ల అనుమానమే నిజమైంది. తల్లి, కొడుకు ఇద్దరూ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. నిందితుల నుంచి రూ.66 లక్షల సొత్తు రికవరీ చేశారు పోలీసులు. మృతురాలు రజితను హత్య చేసి ఆమె వద్ద ఉన్న 300 గ్రాముల బంగారం, రూ.1.90 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తేలింది. నిందితుల నుంచి నేరానికి వినియోగించిన ఓ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలవరపు ఆజయ్‌పై ఉయ్యూరు టౌన్‌లో సస్పెక్ట్ షీట్ ఉన్నట్లు గుర్తించారు.

మొత్తంగా తెలిసిన వ్యక్తులే కదా అని నమ్మిన పాపానికి రజిత ప్రాణాలు తీసేశారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదోనని స్థానికులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సుష్మ, ఆమె కొడుకు అజయ్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.