Site icon NTV Telugu

24 marriages: 30 ఏళ్లు కూడా లేవు.. 24 పెళ్లిళ్లు.. ఇలా దొరికిపోయాడు..

West Bengal

West Bengal

ఓవైపు తగిన పిల్ల దొరకక పెళ్లికాని ప్రసాదులు ఎంతో మంది ఉన్నారు.. ఏళ్ల తరబడి పెళ్లి కోసం నిరీక్షించేవాళ్లు లేకపోలేదు.. మరోవైపు, నిత్య పెళ్లి కొడుకులు.. నిత్య పెళ్లి కూతుళ్ల వ్యవహారాలు కూడ బయటపడుతూనే ఉన్నాయి.. ఇప్పుడు ఓ యువకుడి వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. పట్టుమని 30 ఏళ్లు కూడా నిండడని ఓ యువకుడు.. ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు… ఎంతటి ఘనుడైనా.. ఎక్కడో ఒకదగ్గర చిక్కకపోడు కదా.. ఓ యువతి ఫిర్యాదుతో మన కేడీ యువకుడి బాగోతం మొత్తం బయటపడింది..

Read Also: 5G services: టెలికాం రంగంలో కొత్త శకం.. 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని

ఆ 24 పెళ్లిళ్ల మాయలోడిపై పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళ్తే.. అసబుల్​ మొల్లా అనే 28 ఏళ్ల యువకుడు.. బంగాల్​లోని సాగర్​దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన కొన్నిరోజుల వరకు బాగానే ఉన్న అతగాడు.. ఆ తర్వాత ఇంట్లో నుంచి నగలతో పరారయ్యాడు.. తనను భర్త మోసం చేశాడంటూ సాగర్​దిగీ పోలీస్​ స్టేషన్‌లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది.. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు.. తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం వ్యవహారం బయటపడింది.. ఫేక్‌ ఐడీ కార్డులు సృష్టించి బీహార్​, పశ్చిమ బంగాల్‌లో తిరిగే ఈ అసబుల్​.. ఒక చోట తనకు ఎవరూ లేరని.. మరోచోట జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని.. ఇంకో చోట కూలీ పనే ఆధారమని.. వేరేచోట ఉద్యాగం చేస్తానని.. ఇలా తనకు తోచింది చెప్పడం.. ప్రేమ పేరుతో వల విసరడం.. పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ప్లాన్‌ ప్రకారం జంప్‌ అవ్వడం.. ఇలా 24 పెళ్లిళ్లు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు..

పెళ్లి జరిగిన కొన్నాళ్లపాటు వారితో నమ్మకంగా ఉండి.. అందినకాడికి నగలు, నగదుతో ఉడాయించడమే పనిగా పెట్టుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.. ఇలా ఇప్పటికే 23 మందిని మోసం చేసిన ఈ కేటు గాడు.. సాగర్దిగీ ప్రాంతానికి చెందిన మహిళను 24వ పెళ్లి చేసుకున్నాడు.. అక్కడ కూడా అదే రిపీట్‌ చేశాడు.. కానీ, ఈ సారి బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో మొత్తం గుట్టు బయటపడింది.. ఇక, పరగణాస్ జిల్లా దత్తోపుకుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పలు సిమ్ కార్డులు, నకిలీ సర్టిఫికెట్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతడిని జంగీపూర్ కోర్టులో హాజరుపర్చారు.. అక్కడి నుంచి ఏడు రోజుల రిమాండ్‌కు తరలించారు. అతను ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని బరాసత్‌లోని కాజీపడ ప్రాంతానికి చెందినవాడని విచారణలో గుర్తించారు పోలీసులు.

Exit mobile version