అత్యాశ.. మనిషిని ఎక్కడివరకైనా తీసుకెళ్తోంది. కొంతమంది చెప్పే మాయమాటలు విని, డబ్బు కోసం అత్యాశపడితే చివరికి జైలే గతి.. తాజాగా ఒక వ్యక్తి తనకు పరిచయమైన మరో వ్యక్తి మాటలు నమ్మి, అత్యాశకు పోయి చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి ఒక పురాతన ఇల్లు ఉంది.. వారి తాతముత్తాతల నుంచి సంక్రమించిన ఇల్లు కావడంతో కుటుంబంతో కలిసి అతను అక్కడే నివసిస్తున్నాడు. అయితే ఇటీవల శ్రీనివాస్ తమ బంధువుల పెళ్ళికి వెళ్ళాడు. అక్కడ పూజలు చేసే షాహికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారి అప్పుడప్పుడు కలుసుకొనేవరకు వచ్చింది. మాటల మధ్యలో శ్రీనివాస్ తన పురాతన ఇంటి గురించి షాహికుమార్ కు చెప్పాడు.. దీంతో షాహికుమార్ లో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయేమో చూద్దామని శ్రీనివాస్ తో చెప్పాడు.. పురాతన ఇల్లు కాబట్టి మీ తాతలు గుప్తనిధులు దాచి ఉంటారని అతడిని నమ్మించి క్షుద్రపూజలు చేయడానికి ఒప్పించాడు. అతడి మాయమాటలు నమ్మిన శ్రీనివాస్ సరే అన్నాడు.
పూజకు డబ్బు ఖర్చవుతుందని, అంతేకాకుండా ఒక అమ్మాయి కావాలని షాహికుమార్ తెలిపాడు. అందులోను తన ఇంటి అమ్మాయి కావాలని, ఆమెను నగ్నంగా తన ఎదుట కూర్చోబెట్టాలని తెలిపాడు. దీంతో ఖంగుతిన్న శ్రీనివాస్.. కూలి పనులు చేసే ఒక మహిళకు రూ. 5000 ఇచ్చి నగ్నంగా కూర్చోపెట్టాడు. పూజకు మొత్తం సిద్ధం చేశారు. కానీ శ్రీనివాస్, షాహి కుమార్ కలిసి తిరుగుతుండటం..ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారనే చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
