Father Kills Daughter: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తుంది. హోమ్ స్కూలింగ్ సెషన్ చివరికి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన విషాదంగా మారింది. 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కారణంతో తండ్రే తన కూతురిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా, ఖేరతియా గ్రామానికి చెందిన కృష్ణ జైస్వాల్.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఫరీదాబాద్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే, జైస్వాల్, అతని భార్య ఇద్దరూ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లి పగటిపూట పనికి వెళ్లగా, తండ్రి ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవడం, ముఖ్యంగా కుమార్తె చదువును పర్యవేక్షించేవాడు.
ఇక, జనవరి 21వ తేదీన జైస్వాల్ తన నాలుగేళ్ల కుమార్తెను 1 నుంచి 50 వరకు అంకెలు రాయమని చెప్పాడు. చిన్నారి ఆ పనిని పూర్తి చేయలేకపోవడంతో అతడు కోపంతో ఆమెపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. అయితే, సాయంత్రం తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కుమార్తె అచేతనంగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతికి కారణమైన ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
Read Also: Gold Rates: మగువలకు షాక్.. ఈరోజు గోల్డ్ ఎంత పెరిగిందంటే..!
ఈ సందర్భంగా ఫరీదాబాద్ పోలీస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం.. నిందితుడిని రిమాండ్‌కు తీసుకుని విచారణ చేపట్టాం.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని పేర్కొన్నారు. చిన్నారిపై చదువు ఒత్తిడితో జరిగిన ఈ ఘటన సమాజాన్ని షాక్‌కు గురి చేస్తోంది.. పిల్లలపై తల్లిదండ్రులు చూపాల్సింది ప్రేమ, సహనం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది అన్నారు.
