Fake Judge Arrest: ఏలూరులో జడ్డినంటూ మోసం చేసి యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భగవత నగర్‌కు చెందిన నామాల నరేందర్ (33).. మ్యాట్రిమోనీకి తన బయోడేటా పంపించారు. తాను జడ్జి అని తెలంగాణలో పనిచేస్తున్నానని చెప్పి వివరాలు పెట్టాడు. ఏలూరు కొత్తపేటకు చెందిన సామంతుల నిర్మలకు 2019లో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు. అయితే అతను జడ్జి అని చెప్పడంతో ఇరువురు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని 2022లో రూ.75 లక్షలు కట్నం అడగగా రూ.25 లక్షలు ఇచ్చి వివాహం జరిపించారు.. కొంతకాలం ఖమ్మంలో కాపురం పెట్టారు. ఆ తరువాత అతను అప్పటికే పలువురికి కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించడంతో ఖమ్మం, ఉప్పల్, పొందానగర్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు కావడంతో అరెస్టు చేశారు.
Read Also: Gold Rate Today: ఆల్‌టైమ్ హైకి గోల్డ్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా!
అంతేకాకుండా నిర్మలను రూ.50 లక్షలు తీసుకురావాలని వేధింపులకు గురి చేయసాగాడు.. అతను జడ్జి కాదని తెలుసుకున్న నిర్మల.. గత నెల నవంబర్ 12న ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. సీఐ ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్ఐ కాంతి ప్రియ కేసు నమోదు చేశారు. అయితే, అప్పటి నుంచి నామాల నరేందర్ పోలీసులకు చిక్కకుండా పరీరాలో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడని గుర్తించిన పోలీసులు.. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం రైలు ఆగిన వెంటనే అరెస్టు చేశారు. అతని వద్ద సకిలీ జడ్జి ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాల చిరునామాలతో అతని దగ్గర కార్డులు ఉండడాన్ని గుర్తించారు పోలీసులు..