Site icon NTV Telugu

డ్రగ్స్ కేసు నిందితుడు హన్మంత్ లొంగుబాటు

సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు బండారు హన్మంత్ కోర్టులో లొంగిపోయాడు. ఎల్బీనగర్‌ కోర్టులో హన్మంత్ లొంగిపోయినట్టు తెలుస్తోంది. మేడ్చల్‌ జిల్లాలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా హన్మంత్ వున్నాడు. ఇటీవల మేడ్చల్ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రిన్‌ పట్టుకున్న సంగతి తెలిసిందే.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇస్నాపూర్‌లో డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాటున డ్రగ్స్ తయారుచేస్తున్నాడు హన్మంత్ రెడ్డి. నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు బాలానగర్ పోలీసుల యత్నించారు. కస్టడీలోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

ఈనెల 23వ తేదీన మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో భారీగా డ్ర‌గ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూక‌ట్‌ప‌ల్లికి చెందిన ప‌వ‌న్ మెపిడ్రిన్ డ్ర‌గ్‌ను స్థానికంగా అమ్ముతున్న‌ట్లు ఎక్సైజ్ పోలీసుల‌కు స‌మాచారం వచ్చింది. దీంతో అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

దీంతో మాదకద్రవ్యాల గుట్టురట్టయింది. అతనిచ్చిన సమాచారంతో.. త‌క్ష‌ణ‌మే పోలీసులు మేడ్చ‌ల్‌లోని మ‌హేశ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయ‌గా, ఆయ‌న వ‌ద్ద 926 గ్రాముల డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మ‌హేశ్ రెడ్డి ఇచ్చిన స‌మాచారంతో నాగర్‌క‌ర్నూల్ జిల్లాకు చెందిన రామ‌కృష్ణ‌గౌడ్ ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేసి, 4 కిలోల మెపిడ్రిన్ డ్రగ్‌ను సీజ్ చేశారు.

సుమారు రూ. 2 కోట్ల విలువ గ‌ల 4.92 కిలోల మెపిడ్రిన్ డ్ర‌గ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. విద్యార్థుల‌ను టార్గెట్ చేసుకుని ఈ డ్ర‌గ్‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. డ్ర‌గ్స్ ర‌వాణాకు ఉప‌యోగించిన కారును కూడా సీజ్ చేసిన‌ట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఏ చంద్రయ్య గౌడ్ తెలిపారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితులైన ఎస్‌కే రెడ్డి, హ‌నుమంత రెడ్డి ప‌రారీలో ఉండగా… తాజాగా హన్మంత్ రెడ్డి లొంగిపోవడంతో కేసులో కీలక విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.

Exit mobile version