రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో 52 ఏళ్ల వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన దక్షిణ ఢిల్లీలో కలకలం రేపింది. అయా నగర్ ప్రాంతంలో నవంబర్ 30 తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రత్తన్ లోహియా అనే వ్యక్తి బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి శరీరం నుంచి మొత్తం 69 బుల్లెట్లు వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, నవంబర్ 30 ఉదయం రత్తన్ లోహియా తన పనికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో ముందుగా అక్కడే వేచి ఉన్న దుండగులు కారులో వచ్చి అతన్ని చుట్టుముట్టి వరుసగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో రత్తన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక ఖాళీ బుల్లెట్ షెల్స్‌తో పాటు మూడు లైవ్ కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ముగ్గురు దుండగులు అయా నగర్లో రత్తన్ కోసం కారులో వేచి ఉన్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారుకు నంబర్ ప్లేట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు భారతదేశం వెలుపల ఉన్న గ్యాంగ్స్టర్ల ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, రత్తన్ లోహియా కుటుంబ సభ్యులు ఈ హత్య వెనుక రాంబీర్ లోహియా మరియు అతని బంధువుల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. రాంబీర్ కుమారుడు అరుణ్ హత్యకు ప్రతీకారంగానే ఈ ఘటన జరిగిందని వారు పేర్కొంటున్నారు. గత మే 15న అరుణ్ తన కారులో ఇంటికి వెళ్తుండగా, మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ కేసులో రత్తన్ లోహియా పెద్ద కుమారుడు దీపక్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్యలు పరస్పర ప్రతీకార చర్యలుగా జరిగి ఉండవచ్చని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.