Engineering College : కాలేజీ లాకర్స్‌లో భద్రంగా దాచిన కోటి రూపాయల నగదు దోచుకెళ్లారు దొంగలు !! ఎవరికంటా కనపడకుండా లోపలికి దూరి.. లాకర్స్ బ్రేక్ చేసి మరీ దోచుకెళ్లారు !! 200 సీసీ కెమెరాలకు చెందిన డీవీఆర్‌ను కూడా ఎత్తుకెళ్లారు !! ఇదంతా వింటుంటే… ఏదో తేడాగా ఉందే ? అనిపిస్తోందా..? పోలీసులు కూడా ఇదే అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మేట్‌లోని బ్రిల్లియంట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరిగిన దోపిడీ సంచలనం రేపుతోంది. ఇది అబ్దుల్లాపూర్‌మేట్‌లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజ్. విశాలమైన మైదానంలో అతిపెద్ద క్యాంపస్‌తో.. పకడ్బందీ భద్రతతో ఉంటుంది. ఇలాంటి కాలేజ్‌లో ఉన్నట్టుండి దొంగలు పడ్డారు. సాధారణంగా కాలేజీల్లో దొంగలు పడటం అనేది చాలా అరుదు. ఒకవేళ పడ్డా… విలువైన డాక్యుమెంట్లు, పేపర్లు ఎత్తుకెళ్లడం చూశాం. కానీ.. బ్రిలియంట్ కాలేజ్ లో దొంగలు ఏకంగా కోటి రూపాయలు దోచుకెళ్లారు..
Read Also : Love Story : ప్రేమ వేధింపులకు యువతి బలి
కాలేజ్ క్యాంపస్‌లో మొత్తం 200 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క కెమెరాకు కూడా చిక్కకుండా దొంగలు లోపలికి ఎంట్రీ ఇచ్చారు. నేరుగా కాలేజ్‌లో డబ్బు ఎక్కడ భద్రపర్చారో ఆ లాకర్స్ ఉన్న రూమ్‌లోకి వెళ్లారు. లాకర్లను బద్దలు కొట్టి.. అందులో ఉన్న కోటి రూపాయల నగదు దోచుకున్నారు. 200 సీసీ కెమెరాలకు చెందిన డీవీఆర్‌ను కూడా ఎత్తుకెళ్లారు. తెలివిగా వ్యవహరించిన దొంగలు… అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తపడ్డారు.
ఉదయం కాలేజ్‌కి వచ్చిన తర్వాత డబ్బు చోరీ అవడం గుర్తించిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగతనం జరిగిన తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పక్కాగా ఇంటి దొంగల పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. దొంగలు సాధారణంగా ఇళ్లను టార్గెట్ చేస్తారు కానీ.. కాలేజీలు, స్కూళ్లను టార్గెట్ చేయరు. అందులోనూ కాలేజ్‌లో అంతపెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని కూడా ఎక్స్‌పెక్ట్ చేయరని అంటున్నారు పోలీసులు. డబ్బు దాచిన విషయం తెలిసిన వ్యక్తి కానీ.. డబ్బులు తరలించిన విషయం తెలిసిన వ్యక్తి పనే అయి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. పక్కాగా లోపలికి చొరబడటమే కాకుండా.. సీసీ కెమెరాల డీవీఆర్ కూడా ఎత్తుకెళ్లడం.. ఆనవాళ్లు కూడా చెరిపేయడం వంటివి చేశాడంటే పక్కాగా అన్ని విషయాలు తెలిసిన ఇంటి దొంగే అయి ఉంటాడని పోలీసుల అనుమానం.
మూడు కాలేజ్‌లకు చెందిన కోటి రూపాయల డబ్బంతా.. బ్రిలియంట్ కాలేజ్‌లో దాచామని చెప్తున్నారు యాజమాన్యం. ఇది కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. డబ్బు తరలించే విషయం తెలిసిన వాళ్లు.. తరలింపుకు సహకరించిన వాళ్లు.. కాలేజ్‌లో డబ్బు దాచినట్లు ఎవరెవరికి తెలుసో వాళ్లను.. అందరినీ విచారిస్తున్నారు పోలీసులు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కేవలం ఇంజినీరింగ్ కాలేజీలోనే చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ ఇటీవలే పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. చోరీ జరిగిన తీరు చూస్తుంటే బత్తుల ప్రభాకర్ చోరీ తీరుతో మ్యాచ్ అవుతోంది. దీంతో అతని పని అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
