NTV Telugu Site icon

iPhone: గర్ల్‌ఫ్రెండ్‌కి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు అమ్మ నగలు చోరీ.. 9వ తరగతి విద్యార్థి నిర్వాకం..

Iphone

Iphone

iPhone: తన గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా ఓ బాలుడు అమ్మ నగలనే దొంగిలించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తనతో గర్ల్ ఫ్రెండ్‌కి పుట్టిన రోజున ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఆరోపణలపై బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో దొంగతనం చేసినట్లు బాలుడి తల్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేసిన తర్వాత బాలుడే ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.

నిందితుడు తన తల్లి బంగారు చెవిపోగులు, బంగారు ఉంగరం, బంగారు గొలుసుని చోరీ చేసి కక్రోలా ప్రాంతంలోని ఇద్దరు స్వర్ణకారులకు విక్రయించాడు. బాలిక కోసం హై-ఎండ్ ఫోన్‌ని కొనుగోలు చేశాడు. బాలుడు, బాలిక ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కమల్ వర్మ అనే 40 ఏళ్ల స్వర్ణకారుడిని పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఉంగరం, చెవిపోగులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Illegal Constructions: లేవుట్ భూముల్లోని తాత్కాలిక నిర్మాణాలను తొలగించిన హైడ్రా సిబ్బంది..

‘‘ఆగస్టు 3న మహిళ ఇంట్లో చోరీ జరిగింది. అందులో ఆమె తన ఇంట్లోని రెండు బంగారు గొలుసులు, ఒక జత బంగారు చెవిపోగులు మరియు ఒక బంగారు ఉంగరాన్ని ఆగస్టు 2న ఉదయం 8 నుండి 3 గంటల మధ్య గుర్తుతెలియని వ్యక్తి అపహరించినట్లు ఫిర్యాదు చేసింది.’’ అని డీసీపీ(ద్వారక) అంకిత్ సింగ్ చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారి తెలిపారు. క్రైమ్ సీన్ సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేశారు. అయితే, చోరీ జరిగిన ఇంటి సమీపంలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులు కనుగొనలేదు. సమీప ప్రాంతాల్లో ప్రజల్ని ఎంక్వైరీ చేసినప్పటికీ ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు.

ఇంటి దొంగల పనే అని అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. చోరీ జరిగినప్పటి నుంచి మహిళ కుమారుడు కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. అతడి స్కూల్‌లో స్నేహితులను ప్రశ్నించారు. రూ. 50,000 విలువైన ఐఫోన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ధర్మపుర, కక్రోలా, నజఫ్‌గఢ్‌లో సోదాలు నిర్వహించారు. ప్రతీసారి బాలుడు తప్పించుకోగలిగాడు. చివరకు అతని ఇంటికే వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు.

సెర్చ్ చేస్తే అతని వద్ద నుంచి ఆపిల్ మొబైల్‌ని గుర్తించారు. దర్యాప్తు చేయగా దొంగిలిచించిన బంగారాన్ని ఇద్దరు స్వర్ణకారులకు అమ్మినట్లు బాలుడు చెప్పాడు. తాను 9వ తరగతి చదువుతున్నాని, తన తండ్రి అనారోగ్యంతో మరణించినట్లు పోలీసులకు బాలుడు వెళ్లడించాడు. తనకు చదువుపై ఆసక్తి లేదని బాలనేరస్తుడు చెప్పినట్లు డీసీపీ తెలిపారు. అదే తరగతిలో చదువుతున్న బాలికతో అతడికి సంబంధం ఉన్నట్లు అతని స్నేహితులు పోలీసులకు చెప్పారు. తన ప్రియురాలి పుట్టిన రోజుకు గిఫ్ట్ ఇవ్వాలని చెబితే అతడి తల్లి తిరస్కరిచండంతో డబ్బు కోసం నగులు దొంగిలించినట్లు చెప్పాడని డీసీపీ చెప్పారు.

Show comments