Tragedy : సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణంగా ఒక యువకుడిని ప్రత్యర్థులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి ప్రాణాలు తీశారు. ఇందిరానగర్ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. అల్వాల్‌లోని యాప్రాల్‌కు చెందిన యువన్ అలియాస్ అఖిల్ (21), మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. యువన్ గతంలో చిలకలగూడలోని ఇందిరానగర్‌లో నివసించేవాడు. అక్కడే ఒక యువతితో గత ఐదేళ్లుగా అతడికి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం యాప్రాల్‌లో ఉంటున్నప్పటికీ, తరచూ ఆ యువతిని కలిసేందుకు యువన్ చిలకలగూడకు వస్తుండేవాడు.
గురువారం రాత్రి 9 గంటల సమయంలో యువన్ తన మిత్రులతో కలిసి ఇందిరానగర్‌లో మొబైల్ ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై సుమారు ఏడుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. వారు యువన్‌తో గొడవకు దిగి, ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కత్తులతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
నిందితులు యువన్‌ను వెంటాడి మరీ దాడికి పాల్పడ్డారు. తల, మెడ, చేతులపై సుమారు 15 చోట్ల కత్తులతో పొడవడంతో యువన్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నిందితుల్లో సదరు యువతి సోదరులు , వారి స్నేహితులు ఉన్నట్లు సమాచారం. తమ సోదరితో యువన్ ప్రేమలో ఉండటం ఇష్టం లేని వారు, పక్కా పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. జనం రద్దీగా ఉండే ప్రాంతంలో యువకుడిని ఇంత దారుణంగా హత్య చేయడంపై స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
