Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..

Accident

Accident

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని పామెన గేటు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారు హఠాత్తుగా అదుపుతప్పి, రోడ్డు డివైడర్‌ను దాటుకుని అవతలి వైపు మార్గంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు, ప్రమాదంలో గాయపడిన వారిని గుర్తించారు.

బాధితులు షాబాద్ మండలం పొత్గల్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గౌడ్, మురళి గౌడ్, ఒగ్గు వెంకటయ్య, కార్ల శివకుమార్‌లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రాజ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా గాయపడి మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్షతగాత్రులను ముందుగా సమీపంలోని మొయినాబాద్ మండల పరిధిలో ఉన్న భాస్కర ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను వారిని హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ బాధితులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే బ్రిడ్జి , పామెన గేటు సమీపంలో ఇలాగే వేగంగా వచ్చిన వాహనాలు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందిన ఘటనలు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న చేవెళ్ల పోలీసులు కారు బోల్తా పడిన తీరుపై, ప్రయాణ వివరాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారు.