NTV Telugu Site icon

Cellphone Suicides: ప్రాణాలు తీసిన సెల్ ఫోన్ వివాదం

తన సెల్ ఫోన్ స్నేహితుడు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఒకరు చనిపోగా… బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించలేక మరో స్నేహితుడు మనోవేదనతో ఉరేసుకొన్నాడు. ఫోన్ విషయంలో తలెత్తిన వివాదం ఇరువురి మధ్య చిచ్చురేపింది. క్షణికావేశంలో తీసుకొన్న నిర్ణయాలతో రెండు కుటుంబాలకు తీరని వేదన మిగిలింది.

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ చెందిన నీరడి మహేష్, రాచకొండ సాయిలు స్నేహితులు. ఈ నెల 12న వీరిద్దరు కలిసి నస్రుల్లాబాద్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కుస్తీ పోటీల్లో మహేష్ గెలుపొందారు. అనంతరం స్వగ్రామానికి చేరుకొని ఇద్దరు మద్యం తాగారు.

ఆ సమయంలో మహేష్ సెల్ ఫోన్ పోవడంతో దాన్ని సాయిలు దొంగిలించారని భావించారు. తన తల్లితో కలిసి స్నేహితుడి ఇంటికి వెళ్లి సెల్ ఫోన్ తిరిగివ్వమని అడిగారు. సాయిలు తనకు తెలియదని చెప్పడంతో మనస్తాపం చెందిన మహేష్ పురుగుల మందు తాగారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందాడు. మహేష్ మరణానికి సాయిలే కారణమని భావించిన బంధువులు కుల పెద్దలు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని బాధిత కుటుంబానికి రూ. లక్ష పరిహారం ఇచ్చేలా రాజీ కుదిర్చారు.

సాయిలు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో అత్తారింటికి వెళ్లారు. పంచాయితీలో పరిహారం చెల్లించేలా పెద్దలు ఒప్పించడంతో ఆ డబ్బు కట్టలేక 16వ తేదీన ఏఆర్పీ క్యాంపు శివారులో చెట్టుకు ఉరేసుకొన్నారు. మహేష్‌ కు రెండేళ్ల బాలుడు, భార్య.. సాయిలుకు 8, 6 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు, భార్య ఉన్నారు. సెల్ ఫోన్ కారణంగా ఇద్దరు స్నేహితులు తిరిగి రానిలోకాలకు వెళ్ళిపోయారు.