NTV Telugu Site icon

Coins worth Rs 11 crore missing: బ్యాంకులో చిల్లర మాయం.. రంగంలోకి సీబీఐ.. 25 ప్రాంతాల్లో సోదాలు..

Cbi

Cbi

బ్యాంకులో చిల్లర మాయమైంది.. రంగంలోకి దిగిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. ఏకంగా 25 ప్రాంతాల్లో సోదాలు జరిపింది.. చిల్లర మాయం కావడం ఏంటి? ఆ కేసులో సీబీఐ ఎంట్రీ ఇవ్వడం ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. చిల్లర అంటే.. పావులో.. పరకో కాదండి.. ఏకంగా రూ.11 కోట్ల విలువైన నాణెలు గల్లంతయ్యాయి.. అది కూడా బ్యాంకులో నుంచి.. దీంతో, సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది..

Read Also: Power Purchases Telangana: డిస్కంలపై నిషేధం.. రాష్ట్రాల్లో కరెంట్ కోతలు..?

రాజస్థాన్‌లోని కరౌలీ.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లోని ఖజానాలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.. తాజాగా, అంటే గురువారం రోజు 25 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఏజెన్సీ.. ఏప్రిల్ 13న కేసు నమోదు చేసిందని వారు తెలిపారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలి, సవాయ్ మాధోపూర్, అల్వార్, ఉదయపూర్ మరియు భిల్వారాలోని 25 ప్రాంతాల్లో ఏకకాలంలో.. 15 మంది మాజీ బ్యాంకు అధికారులు మరియు ఇతరుల ప్రాంగణాల్లో సోదాలు జరిపినట్టు వెల్లడించారు.. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌.. ఆగస్టు 2021లో తన నగదు నిల్వలో వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది.. తర్వాత డబ్బు లెక్కింపు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. ఆ లెక్కింపులోనే అసలు విషయం వెలుగు చూసింది. కౌంటింగ్‌ను ఓ ప్రైవేట్ వెండర్‌కు అప్పగించగా, బ్రాంచ్‌లో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైనట్లు తేలింది. దాదాపు రూ. 2 కోట్లతో కూడిన 3,000 నాణేల సంచులకు మాత్రమే లెక్కలు చూపి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నాణేల శాఖకు బదిలీ చేశారు. మిగతా చిల్లర ఎటు పోయింది అని తేల్చేపనిలో సీబీఐ పడిపోయింది.