పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ యువతి రోడ్డు ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో యువతి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన బందెల నర్సింహ కుమార్తె హంసలేఖ అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మంగళవారం పరీక్ష ఉండటంతో బాటసింగారంలోని అన్నమాచార్య కాలేజ్ సెంటర్‌కు పరీక్ష రాసేందుకు ఆమె తన స్నేహితుడితో కలిసి బైక్‌పై బయలుదేరింది.
ఈ క్రమంలో లారీని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఎదురుగా వస్తున్న మరో బైక్ హంసలేఖ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆమె బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. వెనుక నుంచి వస్తున్న లారీ ఆమె శరీరంపై నుంచి వెళ్లడంతో హంసలేఖ అక్కడికక్కడే చనిపోయింది. హంసలేఖ స్నేహితుడితో పాటు మరో బైక్‌పై ఉన్న దీప్తి, సాయిగణేశ్, భానుప్రకాష్ అనే విద్యార్థులు కూడా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.