చిన్న వివాదం ఒక వ్యక్తి హత్యకు కారణమైంది. బెంగళూర్‌లోని ఒక ఆఫీసులో ‘‘ లైట్లు’’ ఆర్పే విషయంలో ఏర్పడిన వివాదం శనివారం తెల్లవారుజామున హత్యకు దారితీసింది. చిత్రదుర్గకు చెందిన 41 ఏళ్ల మేనేజన్‌ను భీమేష్ బాబును అతడి సహోద్యోగి డంబెల్‌తో కొట్టి చంపాడు. ఈ సంఘటన గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డేటా డిజిటల్ బ్యాంక్ కార్యాలయంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ కంపెనీ సినిమా షూటింగ్ వీడియోలను స్టోర్ చేస్తుంది.
Read Also: Asaduddin Owaisi: ‘‘నా టోపీ, గడ్డాన్ని చూసి అలా పిలుస్తావా.?’’ తేజస్వీపై ఓవైసీ ఆగ్రహం..
లైట్ వెలుతురుతో ఇబ్బందిపడే భీమేష్ బాబు, అవసరం లేనప్పుడు లైట్లు ఆపివేయాలని సహోద్యోగుల్ని తరుచుగా అడిగేవాడని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో అతను, తన సహోద్యోగి విజయవాడకు చెందిన టెక్నీకల్ ఎగ్జిక్యూటివ్ సోమల వంశీ(24)ని లైట్లు ఆపేయాలని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కోపంతో వంశీ, భీమేష్ బాబుపై కారం పొడి చల్లి, అతడి తల, ముఖం, ఛాతిపై పదే పదే డంబెల్‌తో కొట్టాడు. బాబు కుప్పకూలడంతో వంశీ భయాందోళనకు గురై ఇతర ఉద్యోగుల సహాయాన్ని కోరాడు. సహోద్యోగులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు, కానీ బాబు అక్కడిక్కడే మరణించినట్లు ప్రకటించారు. వంశీ తర్వాత గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఆఫీసు లైట్ల వివాదం హత్యకు దారితీసిందని డీసీపీ (వెస్ట్) గిరీష్ ఎస్ ధృవీకరించారు.
