Ganja Batch : హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో శనివారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. చంద్రయాన్ గుట్ట ఏరియాలోని ASIపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులే ముప్పతిప్పలు పడేలా ఆ గంజాయి బ్యాచ్ ప్రవర్తించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ ప్రాంతంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అర్ధరాత్రి సమయంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. గాయపడ్డ వారు రోడ్డు మీద రచ్చ రచ్చ చేస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న చంద్రయాన్ గుట్ట పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే, పోలీసులు అక్కడికి చేరగానే ఆ గంజాయి మత్తులో ఉన్న యువకులు వారిపైనే దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా తీవ్ర వాగ్వివాదం జరిగింది. దాడిలో పోలీసులకు చెందిన టాబ్‌ను నిందితులు ధ్వంసం చేశారు.
సుమారు అరగంట పాటు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. చివరికి మత్తులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో చంద్రయాన్ గుట్ట పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, మత్తు పదార్థాల వినియోగం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ సినిమాలో నటించను.. కిరణ్ అబ్బవరం కామెంట్స్