Site icon NTV Telugu

మద్యం మత్తుకు బలైన మరో నిండు ప్రాణం..

ఎన్ని కఠిన ఆంక్షలు విధించిన, చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని శిక్షలు పడుతున్నాకానీ కొందరు మారడం లేదు. వారి జల్సాల కోసం మరొకరి ప్రాణాలు తీస్తూ నిందితులుగా మారుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయవద్దంటూ ప్రభుత్వాలు, పోలీసులు చెబుతున్నా పెడచెవిన పెడుతూ ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. అలాంటి ఘటనే ఘట్‌కేసర్‌ పరిధిలో చోటు చేసుకుంది.

ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థి నిఖిల్‌రెడ్డి మద్యం సేవించి అతి వేగంగా కారు నడుపుతూ ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బైక్‌పై వస్తున్న దంపతులను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న దంపతుల్లో భార్యకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త హనుమాన్‌ దాస్‌కు కూడా తలకు తీవ్రమైన గాయాలవడంతో గమనించిన స్థానికులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

పారిపోతున్న నిందితుడు నిఖిల్‌రెడ్డిని వెంటాడి మరీ స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న హనుమాన్ దాస్‌కు వైద్యలు ఆపరేషన్‌ చేయాలని, రూ.15లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. నిందితుడు నిఖిల్‌రెడ్డిపై మర్డర్‌ కేసు పెట్టాలంటూ హనుమాన్‌ దాస్‌ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version