Anantapur 3 Town Police Chase A Mystery Case: మనం దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు.. ఎవరైనా మార్గమధ్యంలో అడ్డుగా వస్తే ఏం చేస్తాం? హార్న్ కొట్టి, పక్కకు తప్పుకోవాలని సూచిస్తాం. కానీ.. అనంతపురంలో ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒక వ్యక్తిని కిరాతకంగా చంపేశారు. పోలీసులకు పెద్ద సవాలుగా మారిన ఈ కేసుని ఎట్టకేలకు వారం రోజుల తర్వాత చేధించారు. రోడ్డుకి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో.. ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు చంపారని పోలీసులు తేల్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 28వ తేదీన సీసీ సురేష్ తన సహచర ఉద్యోగితో కలిసి ఒక కాఫీ క్లబ్‌కి వెళ్లారు. అక్కడ కాఫీ తాగిన తర్వాత.. రాజీవ్‌కాలనీకి వెళ్లే సర్వీసురోడ్డులో సురేష్ తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఫోన్‌లో మాట్లాడుతున్నారు.
సరిగ్గా అదే సమయంలో.. సోములదొడ్డి వైపు నుంచి బి.సాయికిరణ్, కె.రేణుకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనంలో అటుగా వచ్చారు. రోడ్డుకి అడ్డంగా ద్విచక్ర వాహనం పెట్టాడని.. వాళ్లు సురేష్‌తో వాగ్వాదానికి దిగారు. అది చినికి చినికి గాలివానగా మారి, ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఆవేశంతో.. సురేష్ బండిపై ఉన్న హెల్మెట్ తీసుకొని, అతని తలపై పలుమార్లు బాదారు. తల వెనుక భాగంలో బలమైన గాయాలు అవ్వడంతో.. సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో.. నిందితులిద్దరు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. చాలా కోణాల్లో విచారించారు కానీ, నిందితుల జాడ కనిపించలేదు.
ఎలాగైనా ఈ కేసుని చేధించాలనుకున్న పోలీసులు.. ఒక ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఎట్టకేలకు ఈ కేసుని చేధించారు. నిందితులకి, హతుడికి ఎలాంటి సంబంధం లేదని.. కేవలం ఆ గొడవ సమయంలో క్షణికావేశానికి గురై వాళ్లు హత్య చేసినట్టు పోలీసులు తమ విచారణలో తేల్చారు. సాయికిరణ్, రేణుకుమార్‌లను అరెస్ట్ చేసి.. వారి నుంచి ద్విచక్ర వాహనంతో పాటు హత్యకు ఉపయోగించిన హెల్మెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.