A Boy Attacked Girl Family For Rejected His Proposal: తన ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో.. ఓ ప్రియుడు అత్యంత కిరాతక పనికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కూడా అతనికి వత్తాసు పలుకుతూ.. యువతి ఫ్యామిలీపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఏకంగా 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే.. అదే గ్రామానికి చెందిన మణికంఠ(23) అనే యువకుడు ఆ అమ్మాయిని చాలాకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. తనని పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నాడు. తనకు ఇష్టం లేదని ఆ అమ్మాయి ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా.. మణికంఠ మాత్రం వదల్లేదు. యువతి కుటుంబ సభ్యులు వెంటపడొద్దని హెచ్చరించినా.. అతడు వినలేదు. తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్తూ వచ్చాడు. కానీ, యువతి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే సమస్యని పరిష్కరించుకుందామని.. యువతి కుటుంబ సభ్యుల్ని మణికంఠ పిలిపించాడు.
ఈ చర్చలు జరుగుతున్న సమయంలో.. తాను పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని యువతి చెప్పింది. దీంతో.. రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. మణికంఠతో పాటు అతని బంధువులు.. యువతితో పాటు ఆమె ఫ్యామిలీపై దాడికి దిగారు. ఈ ఘటనలో బాలికతో పాటు మొత్తం 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ పరారీలో ఉండగా, దాడికి పాల్పడ్డ యువకుడి తరఫున బంధువుల్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.