NTV Telugu Site icon

UP Video: సాధువుల వేషంలో చోరీలు.. నలుగురికి దేహశుద్ధి

Lucknowvideo

Lucknowvideo

సాధువుల వేషంలో దర్జాగా చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం వారికి స్థానికులు బడిత పూజ చేశారు. కర్రలు, చెప్పులతో చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధువుల వేషధారణలో నలుగురు వ్యక్తులు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఎలాంటి అనుమానాలు రాకుండా ప్రజల నుంచి విలువైన వస్తువులు, నగదును ఎత్తుకెళ్తున్నారు. వరుసగా వస్తువులు, నగదు చోరీకి గురి కావడంతో యువకులు నిఘా పెట్టారు. నలుగురు సాధువుల వేషధారణలో చోరీలకు పాల్పడడాన్ని గుర్తించి పట్టుకున్నారు. అనంతరం వారికి బడిత పూజ చేశారు. అనంతరం నలుగురు నిందితుల్ని పోలీసులకు అప్పగించారు. తమను క్షమించాలని… తాము నిర్దోషులమని వేడుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. శుక్రవారం ఉదయం సాధువుల వేషంలో ఉన్న పురుషులు మహురకలా గ్రామంలోని ఒక దుకాణం దగ్గరకు వెళ్లారు. దుకాణదారుడితో సంభాసిస్తూ అతనిపై తిలకం వేసి మత్తు ప్రసాదం తినిపించి రూ.1,100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుకాణదారుడు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత దుకాణంలోంచి మూడు బస్తాల ఆవాలు, నగదును దొంగిలించి పారిపోయారు. శనివారం ఉదయం ఆ నలుగురు గంగాఖేడా చేరుకున్నారు. అక్కడ స్థానికులు వారిని గుర్తించారు. స్పృహలోకి వచ్చిన దుకాణదారుడు వారిని గుర్తించడంతో గ్రామస్తులు చితకాబాదారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీకి పాల్పడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మీరట్‌లోని సంసాపూర్ గ్రామ నివాసితులైన ఆకాష్, అక్షయ్, రాకేష్, అమిత్‌లుగా గుర్తించారు. రుద్రాక్ష లేదా ప్రసాదం అందజేసి ప్రజలను మోసం చేసే పద్ధతి వీరిదని విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని.. తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.