దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పీజీ విద్యార్థులు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదమా? హత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు.
ఢిల్లీలోని రోహిణి అనే ప్రాంతంలోని ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ దగ్గర పీజీ భవనం ఉంది. ఆ భవనం నాలుగో అంతస్తు నుంచి పడి ఇద్దరు పీజీ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ఒకరు రాజస్థాన్‌లోని భరత్‌పూర్ వాసిగా.. మరొకరు ఢిల్లీలోని పాలెం కాలనీకి చెందిన నివాసిగా గుర్తించారు. ఇద్దరూ కూడా బీబీఏ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఈషాన్, హర్ష్ వర్మగా కనుగొన్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. మృతులిద్దరూ నాలుగో అంతస్తులోని కిటికీ దగ్గర కూర్చుని ఉన్నారని.. మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు అధికారి తెలిపారు. అయితే పెద్ద శబ్ధంతో పాటు అరుపులు వినిపించినట్లుగా సహచర విద్యార్థులు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం ఇద్దరు విద్యార్థులు రక్తపు మడుగులో ఉన్నట్లు సహచరులు గుర్తించారన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనాస్థలికి వచ్చి పరిశీలించినట్లు అధికారి తెలిపారు. వెంటనే ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఒకరు చనిపోయారని.. ఇంకొకరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారి తెలిపారు. అయితే ప్రమాదవశాత్తు చనిపోయారా? లేదంటే ఏదైనా గొడవ కారణంగా చనిపోయారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా హాస్టల్‌లో ఉన్న మిగతా విద్యార్థులందరినీ విచారిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు విద్యార్థుల మరణవార్తను కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడం బాధాకరమని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఒకేసారి ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో సహచర విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.