NTV Telugu Site icon

Tamil Nadu: నకిలీ ఎన్‌సీసీ క్యాంప్‌లో 13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు

Tamilnadu

Tamilnadu

దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్నే కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతుండగానే.. తాజాగా తమిళనాడులో మరో అత్యంత ఘోరమైన కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఎన్‌సీసీ క్యాంప్ నిర్వహించి.. 13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ప్రిన్సిపాల్ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు మొదటి వారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Minister Subhash: గుణదల ఈఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి సుభాష్

ఓ రాజకీయ పార్టీకి చెందిన శివరామన్ ఇటీవల కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు వెళ్లాడు. పాఠశాలలో ఎన్‌సీసీ క్యాంప్ నిర్వహిస్తామని స్కూల్ యాజమాన్యాన్ని నమ్మించాడు. దీంతో ముందు వెనుక చూసుకోకుండా స్కూల్ మేనేజ్‌మెంట్ నకిలీ ఎన్‌సీసీ క్యాంప్ పెట్టేందుకు అంగీకరించింది. ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ క్యాంప్‌నకు 41 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 17 మంది బాలికలు ఉండగా.. అమ్మాయిలకు మొదటి అంతస్తులోని స్కూల్‌ ఆడిటోరియం, అబ్బాయిలకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వసతి కల్పించారు. పర్యవేక్షణ కోసం స్కూల్ యాజమాన్యం ఎవర్నీ నియమించలేదు. ఇదే అదునుగా భావించి శివరామన్.. 8వ తరగతి విద్యార్థినిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా ఇంకో 12 మంది అమ్మాయిలను కూడా లైంగికంగా వేధించాడు. బాధిత అమ్మాయిలు ఆగస్టు 9నే స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కానీ స్కూల్ పరువుపోతుందని సైలెంట్‌గా ఉన్నారు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: IRCTC: ట్రైన్లో సైడ్ లోయర్ బెర్త్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా.. ముందు ఇది తెలుసుకోండి..?

బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శివరామన్, స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు సహా 11 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తదుపరి కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. అలాగే విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.