NTV Telugu Site icon

The Kashmir Files Review: ది కశ్మీర్ ఫైల్స్ (హిందీ)

The Kashmir Files

The Kashmir Files

వాస్తవ గాథలను తెరకెక్కిస్తున్నామని చెబుతూనే చాలామంది దర్శక నిర్మాతలు కాసుల కక్కుర్తిలో కొన్ని విషయాల్లో రాజీ పడుతుంటారు. సినిమాటిక్ లిబర్జీ పేరుతో చరిత్ర వక్రీకరణకు పాల్పడతారు. కర్ర విరగకుండా, పాము చావకుండా చేసి తమ పబ్బం గడుపుకుంటారు. కానీ 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం అందుకు భిన్నమైంది. వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేసే రొటీన్ బాలీవుడ్ మూవీ కాదిది. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్స్ పై ఎలాంటి దారుణ మారణకాండ చోటు చేసుకుందో కళ్ళకు కట్టినట్టు చూపిన చిత్రమిది. అనేక అవరోధాలను దాటుకుని మార్చి 11న 'ది కశ్మీర్ ఫైల్స్' జనం ముందుకు వచ్చింది. ఈ మూవీకి ఇప్పటికే హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పన్ను రాయితీ ఇచ్చాయి.

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఆయన, ఆయన భార్య పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ అగర్వాల్, జీ స్టూడియోస్ సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన గత చిత్రం ‘ది తాష్కెంట్ ఫైల్స్’ కు చక్కని ఆదరణ లభించడంతో సహజంగానే అందరి దృష్టీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ మీద పడింది.

1990లో కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలను వివస్త్రలుగా చేశారు. సామూహిక మానభంగానికి పాల్పడ్డారు. కశ్మీర్ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మారాలని, లేదంటే చంపేస్తామని మగవాళ్ళను బెదిరించారు. అడ్డగించిన వారి ఆస్తులను దోచుకున్నారు, ఎదురు తిరిగిన వారిని చంపేశారు. తుపాకులు, కత్తులతో దారుణంగా దాడులు చేశారు. అప్పటి వరకూ పక్కపక్కనే కలిసి మెలిసి ఉన్న ముస్లింలు సైతం పాకిస్తాన్ జిహాదీ మూకతో చేతులు కలిపి అకృత్యాలకు పాల్పడ్డారు. పర్యవసానంగా దాదాపు ఐదు లక్షలమంది కశ్మీరీ పండిట్స్ స్వదేశంలోనే కాందిశీకులుగా మారిపోయారు. ఢిల్లీ పురవీధుల పుట్ పాత్స్ పై సంవత్సరాల తరబడి జీవితాన్ని వెళ్ళదీశారు. మరికొందరు జీవిక కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు వలసపోయారు. వేలాది కుటుంబాలు కాలక్రమంలో చెల్లాచెదురైపోయాయి.

ఆనాటి చేదు సంఘటనలకు ప్రతిరూపంగా ఈ చిత్రంలో పుష్కర్ నాథ్ పండిట్ (అనుపమ్ ఖేర్) కుటుంబాన్ని చూపించారు. కశ్మీరీ పండిట్స్ పై ముస్లిం ముష్కర మూకలు దాడి చేస్తున్నా, నిస్సహాంగా నిలిచి పోయిన చేతకాని ప్రభుత్వ అధికారులకు ప్రతీకగా బ్రహ్మదత్ ఐ.ఎ.ఎస్. (మిధున్ చక్రవర్తి), హరి నారాయణ్ డీజీపీ (పునీత్ ఇస్సార్) లను చూపించారు. ఇక చరిత్రను వక్రీకరిస్తూ, కశ్మీర్ లోయలో అసలేమీ జరగనట్టే ప్రపంచానికి తెలియచేసే సోకాల్డ్ సెక్యులర్, లిబరల్ లెఫ్ట్ ఐడియాలజిస్టులకు ఉదాహరణగా ప్రొఫెసర్ రాధికా మీనన్ (పల్లవిజోషి) పాత్రను మలిచారు. జరిగిన వాస్తవాలను తెలుసుకోకుండా, ఉదారవాద సిద్ధాంతాలనే తలకెక్కించుకుని, తన వారికి జరిగిన అన్యాయాన్ని విస్మరించిన నేటి యువతరానికి ప్రతీకగా కృష్ణ పండిట్ (దర్శన్ కుమార్) పాత్రను మలిచారు. వీరందరి ద్వారా మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో అసలేం జరిగిందనే దానిని వివేక్ అగ్నిహోత్రి కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఆనాటి దారుణాలను అలా తెర మీద చూపిస్తుంటే కన్నుల వెంట ధారగా నీరు కారడం ఖాయం. ఈ ముష్కురులను ఏం చేయలేకపోయామే అనే ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకోవడం సహజం.

ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను; కశ్మీర్ ను తమ దేశంలో విలీనం చేసుకోవడానికి పాక్ పాల్పడిన కుట్రలను; అందుకు దాసోహమన్నా స్థానిక ముస్లింల మనసత్త్వాన్ని; ఆ సంఘటనలను తమ రాజకీయ లబ్దికి వాడుకున్న నేతల వికృత చేష్టలను ‘ది కశ్మీర్ ఫైల్స్’లో వివేక్ అగ్నిహోత్రి చూపించాడు. ఓ రకంగా డాక్యుమెంటరీ పద్ధతిలో సాగిన ఈ సినిమాలో ఏదీ ఎక్కువ కాదు, ఏదీ తక్కువ కాదు అన్నట్టుగానే ఉంది. వాస్తవాలను వక్రీకరించినట్టు కానీ, లేని దాన్ని ఉన్నట్టుగా చూపినట్టుగా గానీ ఎక్కడ అనిపించదు. కథ సాగే క్రమం, నటీనటుల అభినయం అందుకు బలం చేకూర్చింది. అలానే రోహిత్ శర్మ నేపథ్య సంగీతం మనల్ని ఆనాటి పరిస్థితులను అనుభూతి చెందేలా చేస్తుంది. కశ్మీర్ పండిట్స్ గురించి కథలతో హిందీలో ఒకటి రెండు సినిమాలతో పాటు తెలుగులోనూ ‘ఆపరేషన్ గోల్డెన్ ఫిష్‌’ మూవీ వచ్చింది. కానీ వాటిల్లోనూ కశ్మీర్ పండిట్స్ పట్ల జరిగిన దారుణాన్ని ఇంత నిజాయితీగా, పచ్చిగా చూపించలేదు.

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలను ప్రతి ఒక్కరూ చూడాలి. కాకపోతే కొందరు పాత గాయాలను రేపడం ఎంతవరకూ సమంజసం అనే ప్రశ్న కూడా వేస్తుంటారు. చరిత్రలో జరిగిన చేదు సంఘటనలను కప్పిపుచ్చి, ఏమీ జరగనట్టుగా వ్యవహరించడం వ్యక్తులకే కాదు ఏ జాతికీ మంచిది కాదు. ఆ వికృతులను గురించి తెలుసుకుని, సరిచేసుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. ఏమీ జరగనట్టుగా ‘ఆల్ ఈజ్ వెల్’ అన్నట్టుగా ఉంటే ఏదో ఒకరోజు ఆ వికృత దెయ్యం మరో రూపంలో మరొకచోట సాక్షాత్కరిస్తుంది. ఆర్టికల్ 370ని కేంద్రం ఎందుకు రద్దు చేసిందని అమాయకంగా అడిగే వారికి ఈ సినిమా చూస్తే బోలెడన్ని సమాధానాలు లభిస్తాయి. నటుడిగా మరోసారి తన ప్రతిభను చాటుకుని సినిమాకు వెన్నెముకగా నిలిచిన అనుపమ్ ఖేర్ ను, పచ్చి నిజాలను తెరకెక్కించిన వివేక్ అగ్రిహోత్రిని ప్రత్యేకంగా అభినందించాలి. ఇలాంటి చిత్రాలు తీయడానికి నిజాయితీ, నిబద్ధత అవసరం. అది తనకుందని వివేక్ నిరూపించుకున్నారు. వాస్తవాలను గుర్తెరిగి కశ్మీర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతరంపైనే ఉందనే పాజిటివ్ నోట్ తో ఈ మూవీ ముగియడం బాగుంది.

రేటింగ్ : 3 / 5

ప్లస్ పాయింట్స్
సహజత్వానికి దగ్గరగా చిత్రీకరణ
వాస్తవాలను వివరించడం
నటీనటుల నటన
నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్స్
సుదీర్ఘ సంఘటనలు
డాక్యుమెంటరీలా సాగడం

ట్యాగ్ లైన్: బిట్టర్ ట్రూత్!