నరహంతక నయీమ్ పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోగానే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతని బయోపిక్ ను ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. రాయలసీమ ఫ్యాక్షన్ గొడవలనే రెండు భాగాల ‘రక్తచరిత్ర’గా తీసిన వర్మ, నయీమ్ కథను మూడు భాగాల చిత్రంగా ప్లాన్ చేశాడంటే, నయీమ్ జీవితంలోని డెప్త్ ను అర్థం చేసుకోవచ్చు. కారణాలు ఏవైనా వర్మ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. ఆ సినిమా కోసం కథను తయారు చేసిన రచయిత దాము బాలాజీ చివరకు తన దర్శకత్వంలోనే ‘నయీమ్ డైరీస్’ పేరుతో సినిమాను రూపొందించాడు. శుక్రవారం ఇది జనం ముందుకు వస్తోంది.
భువనగిరికి చెందిన నయీమ్ గురించి తెలంగాణ వాసులందరికీ తెలిసిందే. చిన్నతనంలోనే దుందుడుకు ప్రవర్తన కలిగిన నయీమ్ యుక్తవయసులో దళంలో చేరాడు. మావోయిస్టుల సిద్ధాంతం కంటే వాళ్ళ చెప్పే సత్వర తీర్పులు, ఇచ్చే కఠిన శిక్షల పట్ల నయీం ఆకర్షితుడయ్యానిపిస్తుంది. ఐపీఎస్ అధికారి కె. ఎస్. వ్యాస్ హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నయీమ్ ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు జైలు జీవితం గడిపాడు. ఖైదీగా ఉండగానే తన తమ్ముడితో కలిసి మావోయిస్టు సానుభూతి పరురాలు, గాయని బెల్లి లలిత హత్యకు కుట్రపన్నాడు. అతి పాశవికంగా జరిగిన ఆ హత్య అప్పట్లో పెద్ద సంచలనం. ఆపైన పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారి జైలు నుండి వచ్చిన నయిమ్ ఇచ్చిన సమాచారం మేరకే ఎంతోమంది నక్సలైట్లను ప్రభుత్వం ఏరిపారేసిందని కథలు కథలుగా చెప్పుకుంటారు. పోలీసుల అండతో నయీమ్ తనదైన ఓ నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నయీమ్ ఆటలు సాగలేదు. అధికార పార్టీ నేతలను, అందులో చేరిన మాజీ నక్సలైట్లను నయీమ్ టార్గెట్ చేసి బెదిరించడం, చంపేయడంతో… చివరకు పోలీస్ ఎన్ కౌంటర్ లో కన్నుమూయాల్సి వచ్చింది. చిత్రం ఏమంటే… పోలీస్ ఇన్ ఫార్మర్ గా పనిచేసిన నయీమ్ ఎంతోమంది పోలీస్ అధికారులకు బినామీగా ఉన్నాడట. కోట్ల రూపాయలను ఆ అధికారులు నయీమ్ దగ్గర దాచి పెట్టారట. వీటికి సంబంధించిన నిజానిజాలను బయటపెడతామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించినా, నయీమ్ వెనుక బడా రాజకీయ నేతలూ ఉండటంతో ఆ విచారణలన్నీ తెరమరుగయ్యాయి.
ప్రతి వ్యక్తి చేసే పనికీ రెండు కోణాలు ఉంటాయి. మన అనుకున్న వాళ్ళు తప్పు చేసినా, ఏ కారణంగా అతను అలా చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అతను చేసిన నేరాన్ని ఏదో కారణంగా తక్కువ చేసే చూపించాలని తాపత్రయ పడతాం. ‘నయీమ్ డైరీస్’ చిత్రంలోనూ అదే జరిగింది. నయీమ్ నరహంతకుడు అని ఒకవైపు చూపుతూనే, అతను అలా మారడానికి మావోయిస్టు పార్టీ, ఆ తర్వాత అతన్ని వాడుకున్న ఈ రాజ్యం కారణమని దర్శకుడు దాము బాలాజీ చెప్పే ప్రయత్నం చేశాడు. పులిమీద స్వారీ చేసే వ్యక్తి ఏదో ఒకరోజు ఆ పులి బారిన పడక తప్పదని, నయీమ్ విషయంలోనూ అదే జరిగిందని తెలిపాడు. నయీమ్ చేసిన అకృత్యాలన్నింటికీ ఒక బలమైన కారణాన్ని చూపుతూ ఇలా చేయడం సబబే కదా! అనే భావన ప్రేక్షకుడికి కలిగించే ప్రతయ్నం చేశాడు. దాంతో ఈ సినిమా చూసిన తర్వాత నయీమ్ మీద మనకు సానుభూతి కలగకపోయినా, అతని మీద ఉన్న ద్వేషం తాలుకు తీవ్రత కొంత తగ్గే ఆస్కారం ఉంది. తన సోదరి మీద ఉన్న అపరిమితమైన ప్రేమే ఒక్కోసారి అతన్ని ఉన్మాదిలా మార్చింది అని చెబుతూనే, మొత్తం నయీమ్ కుటుంబమంతా నేర ప్రవృత్తి కలిగిందే అనే విషయాన్ని స్పష్టం చేశారు.
చివరగా నయీమ్ ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల చేతిలో కీలుబొమ్మ తప్పితే మరొకటి కాదనే అభిప్రాయం కలిగేలా ఈ చిత్రం తీశారు. దర్శకుడు దాము బాలాజీ ఒకప్పుడు దళంలో పనిచేసిన వ్యక్తి కావడంతో పార్టీలో అగ్ర నాయకులు కొందరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు, క్యాడర్ పట్ల వారు చూపించే వివక్షత, వాళ్ళు చేసే దందాల గురించి అవకాశం చిక్కినప్పుడల్లా సినిమాలో ఎండగట్టాడు. అలానే అమాయక యువతను అడవికి వెళ్లమని ప్రోత్సహించే సోకాల్డ్ విప్లవ రచయితలు తమ పిల్లలను మాత్రం అమెరికాకు ఉద్యోగాల కోసం పంపడాన్ని ప్రశ్నించాడు. ఇలాంటి తప్పదాలే నయీమ్ మావోయిస్టులకు దూరం కావడానికి కారణంగా చూపించాడు. బయటి వ్యక్తులు ఇంత సూటిగా మవోయిస్టులను ప్రశ్నించే ఆస్కారం చాలా తక్కువ. ఈ విషయంలో దాము బాలాజీని అభినందించాలి. అయితే, ఇదే సమయంలో ‘మావోయిస్టులా, పోలీసులా?’ అంటే తాను మావోయిస్టుల పక్షమే తీసుకుంటానని నయీమ్ ద్వారా చెప్పించడంతో దర్శకుడి మనసు లోలోపల మావోయిస్టుల పట్ల ఉన్న మమకారం వ్యక్తం అవుతోంది.
సహజంగా బయోపిక్స్ తీసేప్పుడు పోలికలు చూసుకుంటారు. కానీ అలా కాకుండా నయీమ్ ప్రవర్తనను, బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని వశిష్ఠ ఎన్ సింహా ను నయీమ్ పాత్ర కోసం దర్శకుడు దాము బాలాజీ ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటికే ‘కె.జి.ఎఫ్.’, ‘నారప్ప’ చిత్రాలతో తెలుగు వారికి సుపరిచితుడైన వశిష్ట, నయీమ్ పాత్రలో భావోగ్వేగాలను బాగానే పండించాడు. తన భూజానికి ఎత్తుకుని సినిమాను నడిపించాడు. అతని సోదరిగా యజ్ఞాశెట్టి (లక్ష్మీస్ ఎన్టీయార్ ఫేమ్), గాయని లతగా సంయుక్త హర్నాద్, పోలీస్ అధికారిగా శశికుమార్, టాస్క్ ఫోర్స్ హెడ్ గా డి.ఎస్. రావ్, నయీమ్ భార్య గా దివి, నక్సలైట్ నాయకుడిగా దేవిప్రసాద్ తదితరులు నటించారు. అరుణ్ ప్రభాకర్ నేపథ్య సంగీతం, సురేశ్ భార్గవ్ సినిమాటోగ్రఫీ ఓకే. సి.ఎ. వరదరాజు నిర్మించిన ఈ సినిమా నయీమ్ గురించి, అతని దందాల గురించి అవగాహన ఉన్న వాళ్ళకు ఆసక్తిని కలిగిస్తుంది. కానీ సాధారణ ప్రేక్షకుడిపై పెద్దంత ప్రభావం చూపదు. మావోయిస్టులు, పోలీసుల చేతిలో నయీమ్ కేవలం కీలుబొమ్మ అని చెప్పే ఈ చిత్రం చూసిన తర్వాత, వారిద్దరినీ నయీమ్ తన స్వార్థ ప్రయోజనాలకు ఆ యా సమయాల్లో, సందర్భాల్లో వాడుకున్నాడని ఎందుకు అనుకోకూడదనే ప్రశ్న కూడా ఉదయించక మానదు!
రేటింగ్ : 2.5 / 5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
ఆలోచింపచేసే మాటలు
నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని కథనం
ట్యాగ్ లైన్: రక్తపు రాతల డైరీ!