Hyderabad: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బందితో పాటు అయన పాల్గొంటున్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ప్రజా భద్రత కోసం చేపట్టిన కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కమిషనర్ సజ్జనార్ కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని తెలిపారు. చాంద్రాయణ గుట్టలో జరిగిన ఆపరేషన్ కవచ్ లో ఆడిషనల్ కమిషనర్ టఫసీర్ ఇక్బల్ పాల్గొన్నారు.