విడుదల: నెట్ ఫ్లిక్స్, 05-11-2021
నటీనటులు: సాన్య మల్హోత్రా, అభిమన్యు దాసాని
నిర్మాతలు: కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మెహతా
సినిమాటోగ్రఫీ: దేబోజీత్ రే
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
దర్శకత్వం: వివేక్ సోని
ఒక ఇంటికి పెళ్ళిచూపులకు వెళ్ళబోయి పొరపాటున మరో ఇంటికి వెళ్ళడం, ఆపై
వధూవరులు ప్రేమలో పడటం కాన్సెప్ట్ తో పలు చిత్రాలు వచ్చాయి. అయితే ఇందులో వధూవరులిద్దరూ ఇష్టపడ్డారని పెద్దలు కూడా అంగీకరించి పెళ్ళి చేయటం కొత్తదనం. అసలు సినిమా టైటిల్ ‘మీనాక్షి సుందరేశ్వర్’ పేరే ఆకట్టుకుంటుంది. నవంబరు 5న డిజిటల్ ప్లాట్ ఫామ్ లో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.
కథ విషయానికి వస్తే చాలా సింపుల్. మీనాక్షి (సన్యా మల్హోత్రా) రజనీకాంత్ అభిమాని. పుస్తకాలంటే ఇష్టం ఉన్న యువతి. ఇక సుందరేశ్వర్ (అభిమన్యు) ఇంజనీరింగ్ పూర్తి చేసి కోడింగ్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నవాడు. పుస్తకాలు, సినిమాల గురించి అవగాహన లేనివాడు. అనుకోని విధంగా పెళ్ళిచూపులలో కలుసుకుని దంపతులైన వీరిద్దరినీ అభిమన్యు జాబ్ విడదీస్తుంది. మధురై నుండి ఉద్యోగార్ధం బెంగుళూరుకి మకాం మారుస్తాడు సుందరేశ్వర్. అయితే బ్రహ్మచారులకే పరిమితమైన జాబ్ కావడంతో మీనాక్షి అత్తవారింటిలోనే ఉండి పోతుంది. ఉద్యోగంలో భాగంగా యాప్ ని క్రియేట్ చేయటంలో బిజీగా ఉంటూ మీనాక్షని దూరం పెడతాడు సుందరేశ్వర్. ఇక అత్తవారింట్లో అనుకోకుండా తన ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ వల్ల అపార్థానికి లోనవుతంది మీనాక్షి. అది సుందరేశ్వర్ తో ఘర్షణకు దారితీస్తుంది. మరి
సుందరేశ్వర్ కోడింగ్ లో తను అనుకున్నది సాధించాడా? స్వతంత్ర్య భావాలు కలిగిన మీనాక్షి తన స్వాభిమానాన్ని నిలబెట్టుకుంటుందా? అన్నదే చిత్ర కథాంశం.
దర్శకుడు వివేక్ సోనికి ‘మీనాక్షి సుందరేశ్వర్’ మొదటి సినిమా. అయినా చెప్పదలచుకున్న అంశాన్ని సూటిగా ప్రజెంట్ చేశాడు. అయితే అక్కడక్కడా బోరు కొట్టినా ప్రధాన పాత్రధారుల నటన, నేపథ్య సంగీతం ఆ భావన రానీకుండా చేయటంలో సఫలం అయ్యాయి. పెళ్ళయి ఎడబాటులో ఉన్న జంటల అభద్రతాభావాలు, గొడవలు, లోపాలు, సంఘర్షణను దర్శక రచయితలు చక్కగా ఫోకస్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అభిమన్యు దస్సాని సుందరేశ్వరుని పాత్రలో ఒదిగి పోయి తన పాత్రను చక్కగా చేశాడు. ఇక జిగర్తాండతో కరిదోసెను తినడానికి ఇష్టపడే మీనాక్షిగా సన్యా మల్హోత్రా అదుర్స్ అనిపించింది. రజనీకాంత్ స్టైల్ ను యాజ్ టీజ్ గా దించేసింది. కళ్ళతోనే సన్యా పలికించిన హావభావాలు సినిమాకు పెద్ద ఎసెట్ అనే చెప్పాలి. భర్త సాన్నిహిత్యం కోసం తపిస్తూ సుందర్ చొక్కా పరిమళాన్ని పీల్చుకునే సన్నివేశంలో జీవించేసింది. తిండి ప్రియుడుగా మనోజ్ మణి మాథ్యూ అక్కడక్కడా హాస్యాన్ని నింపారు. అర్చన అయ్యర్, శివకుమార్ సుబ్రమణియం, పూర్ణేందు భట్టాచార్య, రితికా షోహ్త్రి, డానిష్ సూద్, వరుణ్ శశి రావు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక దేబోజిత్ రే కెమెరా పనితనం అద్భుతం. మధురై అందాలను తను అందంగా తెరకెక్కించాడు. మీనాక్షి ఆలయ నగరాన్ని తన కెమెరా కన్నుతో చక్కగా ఆవిష్కరించాడు. ప్రశాంత్ రామచంద్రన్ ఎడిటింగ్ ఓకె. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సినిమాకి ఆయువు పట్టు అనే చెప్పాలి. కథకి అనుగుణంగా చక్కటి పాటలను ఇవ్వడమే కాదు నేపథ్య సంగీతంతో సినిమాను నిలబెట్టాడు. అసలు సన్యామల్హోత్రా కోసమైనా ఓసారి సినిమా చూడవచ్చు.
ప్లస్ పాయింట్స్
సన్యామల్హోత్రా, అభిమన్యు నటన
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
అతి మామూలు కథ
స్లో నెరేషన్
రేటింగ్: 2.5
బోటమ్ లైన్: మీనాక్షి దర్శనం