Chairman’s Desk: దేశంలో న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవం ఉంది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కూడా న్యాయవ్యవస్థ పట్ల భయభక్తులతో నడుచుకుంటాయి. కొమ్ములు తిరిగిన నేతలు కూడా.. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. దేశ చరిత్రలో అడపాదడపా కోర్టులు తమకు ఎంతటి బలమైన అధికారాలున్నాయో నిరూపించిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా.. న్యాయవ్యవస్థే దేశ ప్రజలకు దారిదీపమై నిలిచిందనే కితాబులకు లోటేం లేదు. కానీ అలా ఓ వెలుగు వెలిగిన న్యాయవ్యవస్థ ప్రభ.. కొంతకాలంగా మసకబారుతోంది. ఇటీవలి కాలంలో హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. అసలు జడ్జిలు ఇలా ఎలా వ్యవహరిస్తున్నారని కూడా ఆశ్చర్యపోతోంది. ఒక కేసు ఫలానా బెంచ్ పైకి వచ్చింది అంటే…. సామాన్య జనం ఆ బెంచ్ పై తీర్పు ఎలా ఉంటుందో ముందే చెప్పేస్తున్నారు. ఒక పాపులర్ డైరెక్టర్ తీయబోయే సినిమాని జనం ఎలా అయితే ఊహించి ముందే కథ చెప్తారో…. అలా ఒక న్యాయమూర్తి, ఒక బెంచ్ ఇవ్వబోయే తీర్పు ఎలా ఉండబోతుందో సామాన్య జనం ముందే ఊహించగలుగుతున్నారు. ఇది భారతీయ ప్రజాస్వామ్యంలో అత్యంత విషాదకరమైన పరిణామం. అంటే ఈ న్యాయమూర్తి ఫలానా వాళ్లకు అనుకూలంగా ఉంటాడు, ఈ జడ్జి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటాడు అని ప్రజల్లో ఒక బలమైన భావన వచ్చేసింది. న్యాయమూర్తులు, కోర్టులు, బెంచ్ లకు సొంత అజెండాలు ఉంటాయని…. వాటి ప్రకారమే తీర్పులు వస్తాయని జనం భావించడం ప్రస్తుతం న్యాయవ్యవస్థ దుస్థితికి అద్దం పడుతుంది .ఇలాంటి పరిస్థితి న్యాయవ్యవస్థకు రావడం చాలా బాధాకరం. ఇక బెయిళ్ల విషయంలో తీర్పులైతే పెద్ద బ్రహ్మపదార్థంగా మారాయనడంలో సందేహమే లేదు. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో.. నెలల తరబడి బెయిల్ రాకపోవడం.. సీరియస్ కేసుల్లో ఊహించని విధంగా బెయిల్ రావడం.. పరిపాటిగా మారిపోయింది. కొన్ని తీర్పులు చూసి.. న్యాయకోవిదులే కాదు.. సాధారణ ప్రజలు కూడా కోర్టులు కూడా ఇలా తయారయ్యాయేంటని మాట్లాడుకునే దుస్థితి ఉందంటే నమ్మాల్సిందే. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
దేశంలో ఎక్కడ న్యాయం జరగకపోయినా.. కోర్టుకెళ్తే కచ్చితంగా న్యాయం దక్కుతుందని మొన్నటివరకూ సామాన్యులకు ఆశలుండేవి. అలాగే జడ్జిలు నిజాయితీగా ఉంటారని, నిష్పాక్షికంగా తీర్పులిస్తారనే నమ్మకం ఉండేది. కానీ ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఇంట్లో కట్టలు కొద్ది క్యాష్ దొరకడం దేశంలోనే సంచలనం సృష్టించింది. జస్టిస్ వర్మ వ్యవహారం అభిసంశన దిశగా వెళ్ళింది. అంతకుముందు అక్రమ మైనింగ్ కేసులో నిందితులు బెయిల్ కోసం జడ్జికే లంచం ఇవ్వజూపటం.. ఆ తర్వాత ఇదే కేసులో బెయిల్ ఇచ్చే విషయంలో లంచం తీసుకుంటున్న ఒక జడ్జిని సిబిఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అలాగే గతంలో చాలామంది న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అందులో కొన్ని అభిసంసన వరకు వెళ్లాయి. భారతదేశంలో న్యాయమూర్తులు అందరూ దారి తప్పారని మనం ఆరోపించలేం. అలా అని భావించలేం. కానీ తులసి వనంలో గంజాయి మొక్కలు ఉంటున్నాయనే విషయం మాత్రం చాలాసార్లు రుజువు అవుతుంది. ప్రజల్లో ఆ భావన బలంగా ఉంది.
దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తుందని అందరూ భావిస్తారు. కానీ, ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో భారీ మొత్తంలో నగదు లభ్యమైన ఘటన కేసు తీర్పు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టు చర్యలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో, ఆయన నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా ఆయన ఇంటిలో భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఈ ఘటన అనేక అనుమానాలకు, అవినీతి ఆరోపణలకు దారితీసింది. దీని పర్యవసానంగా, జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ ఆరోపణలను పరిశీలించడానికి ముగ్గురు న్యాయమూర్తులతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ నివేదిక ఆధారంగా జస్టిస్ వర్మను తొలగించాలని సిఫార్సు చేశారు.
జస్టిస్ వర్మ ఈ సిఫార్సును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో భారతదేశ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ దాఖలు చేసిన తీరును తప్పుబట్టింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ దాఖలు చేయకూడదని తెలిపింది. ఈ కేసులో జస్టిస్ వర్మ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. రాజ్యాంగంలో న్యాయమూర్తిని తొలగించేందుకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని, ఆ నిబంధనల ప్రకారం న్యాయమూర్తి తప్పిదం నిరూపితం కాకముందే ఆయనపై చర్చ జరపడం సరికాదని వాదించారు. రాజ్యాంగం ప్రకారం, న్యాయమూర్తి తప్పిదం నిరూపితం కాకుండా పార్లమెంటులో కూడా చర్చించడం నిషేధమన్నారు.
జస్టిస్ వర్మ తన పిటిషన్‌లో సుప్రీంకోర్టు ప్యానెల్ తన వాదనను సరిగ్గా వినలేదని పేర్కొన్నారు. న్యాయమూర్తిని తొలగించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని, సుప్రీంకోర్టు ఈ విషయంలో సిఫార్సు చేయడం రాజ్యాంగంలోని అధికార విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమేనని ఆయన వాదించారు. న్యాయవ్యవస్థ పార్లమెంటు అధికారాలను స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ఆయన తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. మొత్తం మీద జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ నిబంధనలు, న్యాయమూర్తుల తొలగింపు వంటి అనేక కీలక అంశాలను లేవనెత్తింది. తన నివాసంలో నోట్ల కట్టలకు జస్టిస్ యశ్వంత్ వర్మ బాధ్యత వహించక్కర్లేదా..? వర్మ ఆరోపించినట్టుగా సుప్రీం కోర్టు నిజంగా తన అధికార పరిధి దాటిందా..? అనే మౌలిక ప్రశ్నలు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆరోపణలు వస్తేనే ఒకప్పుడు జడ్జిలు రాజీనామాలు చేసేవారు. ఆ తర్వాత కాలంలో సుప్రీంకోర్టు రాజీనామా చేయాలని సూచిస్తే.. ఆ సూచనలు పాటించేవారు. కానీ నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలే కాదు.. నోట్లకట్టలు లభ్యమైనట్టు సుప్రీం నియమించిన జడ్జిల ప్యానెల్ రుజువు చేసిన తర్వాత కూడా జస్టిస్ వర్మ ఇంకా న్యాయపోరాటానికి నిర్ణయించుకోవడం పెద్ద విడ్డూరం. న్యాయవ్యవస్థలో దిగజారుతున్న విలువలకు ఈ కేసు పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది.
జస్టిస్ వర్మ కేసును పక్కనపెడితే.. కొన్ని కేసుల్లో కోర్టులు ఇస్తున్న తీర్పులు.. వాస్తవాలకు భిన్నంగా ఉండటం కూడా న్యాయవ్యవస్థ గౌరవాన్ని తగ్గిస్తోంది. ఏడు సంవత్సరాలలోపు శిక్షపడే బెయిలబుల్ కేసుకు స్టేషన్ బెయిలు ఇవ్వాలని చట్టం చెబుతుంది. స్టేషన్ బైలు ఇవ్వాల్సిన కేసుకు కూడా నెలల తరబడి బెయిల్ ఇవ్వకుండా కోర్టులు వ్యవహరిస్తున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఊహించని విధంగా బెయిళ్లు వచ్చేస్తాయి. కొన్ని కేసుల్లో ఛార్జిషీట్ వేసిన తర్వాత కూడా బెయిళ్లు రావు. ఏడు సంవత్సరాలలోపు బెయిలబుల్ నేరానికి ఒక నోటీసు ఇవ్వాలి. స్టేషన్లో విచారించి బెయిల్ ఇవ్వాలి. కానీ ఆ రూల్స్ ని పోలీసులు అతిక్రమిస్తున్నారు. కొన్నిసార్లు కోర్టులు కూడా పట్టించుకోవడం లేదు. హైకోర్టు జడ్జికి, చిన్న కోర్టు జడ్జికి కూడా విస్తృతమైన అధికారాలు ఉంటాయి. దానిని కాదనలేం. కానీ ఆ అధికారాలు సామాన్యుడికి న్యాయాన్ని అందించే విషయానికి ఉపయోగపడాలి కానీ… నిందితులకు కాపాడటానికి కాదనేదే.. ఆ అధికారాల వెనకున్న ఉద్దేశం.
అదే సమయంలో న్యాయవ్యవస్థలో సరిపడినంత సిబ్బంది లేని మాట కూడా నిజమే. కేసులు పెరిగిపోవడంతో.. వృత్తిపరమైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయని కూడా సీజేఐగా వచ్చిన వారంతా వాపోతూనే ఉన్నారు. దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని భారత న్యాయవ్యవస్థపై విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. అదే అమెరికాలో ప్రతి 10 లక్షల మంది పౌరులకు 150 మంది జడ్జిలు, ఐరోపాలో 220 మంది జడ్జిలు ఉన్నారని గతంలో విడుదలైన పలు నివేదికలు పేర్కొన్నాయి. 1987లో ఏర్పాటైన న్యాయ కమిషన్ దేశంలో ప్రతి పది లక్షల మందికి జడ్జిల సంఖ్య 50గా ఉండాలని సూచించింది. 2025లో హైకోర్టుల్లో మొత్తం మంజూరు చేసిన పోస్టుల్లో 33 శాతం జడ్జి పోస్టులు ఖాళీగా ఉండగా, జిల్లా కోర్టుల్లో అది 21 శాతంగా ఉంది. జాతీయ స్థాయిలో చూస్తే జిల్లా కోర్టుల్లో ఒక్కో న్యాయమూర్తిపై 2,200 కేసుల పనిభారం ఉంది. అలహాబాద్, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ఒక్కో న్యాయమూర్తి 15 వేల కేసులు వినాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. అయితే ఇదే పనిభారం మిగతా వ్యవస్థల్లోనూ లేకపోలేదు. కొన్ని కేసుల్లో తీర్పులు ఇచ్చే సమయంలో.. పనితీరులో తేడాకు.. పనిభారం వెసులుబాటు కాదని కోర్టులే తేల్చిచెబుతున్నాయి.అలాంటప్పుడు అదే సూత్రం న్యాయవ్యవస్థకు కూడా వర్తిస్తుందంటున్నారు న్యాయకోవిదులు. ప్రస్తుతం కొందరు జడ్జిలు ఆ పనిభారం, లేకుంటే మిగతా కారణాలు సాకుగూ చూపించొచ్చనే ఉద్దేశంతో.. తమ పవిత్రమైన విధుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
