Chairman’s Desk : ప్రపంచం యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. నేతల పంతాలు, పట్టింపులతో కోట్ల మంది ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. గెలుపోటముల గురించే తప్ప జనం కన్నీళ్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితమే కరోనా ప్రపంచానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. పేద ధనిక దేశాలనే తేడా లేకుండా అన్నింటికీ ప్రాణ, ఆర్థిక నష్టం తప్పలేదు. అయినా సరే ప్రపంచ దేశాలు మారకుండా చిన్న చిన్న ఘర్షణలను.. చేజేతులా యుద్ధాలుగా మార్చుకుంటున్నాయి. వినాశనాన్ని కొనితెస్తున్నాయి. యుద్ధంతో ఎవరికీ వచ్చేది ఏమీ ఉండదని చరిత్ర చెబుతున్నా.. వినడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడమే అసలైన విషాదం. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
ఏ యుద్ధంలోనైనా అందరూ గెలుపు ఓటములు మాత్రమే చూస్తారు. ఆ యుద్ధం ఈ రాజు గెలిచారు. ఈ యుద్ధంలో ఆ రాజు ఓడిపోయాడని చరిత్రలో రాసుకుంటారు. కానీ యుద్ధం తర్వాత మిగిలిపోయే కన్నీళ్లు.. బాధలు ఎవ్వరూ రాయరు. వాటిని పట్టించుకోరు. కార్గిల్ యుద్ధంలో మనం గెలిచామని సంబరాలు చేసుకుంటాం. కానీ అదే యుద్ధంలో చనిపోయిన భారతీయ సైనికుల్ని ఒక్కరోజు తర్వాత మళ్లీ స్మరించుకోము. ఏ యుద్ధంలోనైనా దేశాధినేతలే గెలుస్తారు. సామాన్య సైనికులు అశువులుబాస్తారు. కుటుంబాలకు కన్నీళ్లే మిగులుస్తారు. ఇదే యుద్ధం వెనక ఉండే అసలైన కన్నీటి గాధ.
యుద్ధాన్ని ఎప్పుడూ ఎవ్వరూ ఆహ్వానించకూడదు. అన్ని రకాల ప్రత్యామ్నాయాలు విఫలమైతేనే.. అనివార్య పరిస్థితుల్లో పోరుకు వెళ్లాలి. కానీ ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మాత్రం అలాంటివి కాదని చెప్పడానికి పెద్దగా సందేహించాల్సిన పనేం లేదు. అనుమానాలు, అపోహలు, అపార్ధాలతోనే పెను యుద్ధాలు జరుగుతున్నాయి. ఆయుధాలున్నాయి కదా అనో, సైనిక బలాన్ని చూసుకునో.. అకారణంగా సమరం చేసే పోకడ పెరగడం ప్రపంచానికి చేటు చేస్తోంది. గత శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగి.. లక్షల మంది మరణించినా.. కూడా ప్రపంచంలో ఆధిపత్య పోరు ఆగలేదు. కొన్ని దశాబ్దాల పాటు అమెరికా, రష్యా ఆధిపత్య పోరు మధ్య ప్రపంచం నలిగిపోయింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం పదుల సంఖ్యలో ఉగ్రవాద గ్రూపుల్ని సృష్టించింది. కొన్ని దేశాల్లో రావణకాష్టాల్ని మిగిల్చింది. తర్వాత ఏకధృవ ప్రపంచం అయినా.. ఎక్కడికక్కడ సంక్షోభాగ్నులు రగులుతూనే ఉన్నాయి.
కొత్తగా యుద్ధాలు చేసేటప్పుడు.. అంతకుముందు పోరు చేసి ఏమైనా సాధించామా.. లేదా అనేది ఎవరికి వారే సింహావలోకనం చేసుకోవాలి. కానీ ఆధునిక ప్రపంచంలో ఆ పరిణతి కనిపించడం లేదు. ఎలాగోలా యుద్ధం చేసేసి.. ఏదో సాధించేయాలనే తాపత్రయమే కానీ.. నిజానికి ఏమీ సాధించలేమనే సంగతిని గుర్తించడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అసలిప్పుడు యుద్ధాలు ప్రారంభించడం కంటే ముగించడం చాలా కష్టమైపోతోంది. ఎందుకంటే ఏ దేశమూ ఓడిపోవడానికి రెడీగా లేదు. ఎవరికి వారు స్వశక్తితోనో, మిత్రుల బలంతోనే యుద్ధాలు కొనసాగిస్తున్నారే కానీ.. ఓటమి అనే పదం వినటానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే పెద్ద దేశాలు కూడా చిన్న దేశాల మీద గెలవలేక ఆపసోపాలు పడుతున్నాయి. కానీ ఉక్రెయిన్ యుద్ధం రూపాంతరం చెందిన తీరు చూశాక కూడా ప్రపంచం మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మూడేళ్లు దాటినా ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోగా.. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ, ఇరాన్ యుద్ధం పులి మీద పుట్రలా పరిణమించాయి. యుద్ధం నిరంతర సంక్షోభానికి దారితీస్తోంది. బుల్లెట్లు, మందుగుండు, క్షిపణులతో చిన్న ఘర్షణలు కూడా దీర్ఘకాలిక యుద్ధాలుగా మార ప్రపంచం గుండెలపై కుంపటి రగిలిస్తున్నాయి.
యుద్ధం వాంఛనీయం కాదని నాటి అశోకుడు, అలెగ్జాండర్ నుంచి నేటి వరకు చాలా మంది చెప్పారు. అయినా సరే దేశాధినేతలు చెవికెక్కించుకోవడం లేదు. పైగా యుద్ధాలు చేసి ప్రజల దృష్టిలో హీరోలుగా వెలిగిపోవాలనే యావ పెంచుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమో, పొరుగు దేశంపై పైచేయి కోసమో.. అసలు సమస్యల నుంచి పక్కదోవ పట్టించడానికో.. యుద్ధాన్ని ఆయుధంగా చేసుకోవడం విస్తుగొలుపుతోంది. స్వప్రయోజనాల కోసం వేల మంది సైనికుల్ని బలిపెడుతూ.. లక్షల మంది సైనిక కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చుతున్నారు. యుద్ధాల కారణంగా అన్నిరకాలుగా నష్టం జరుగుతున్నా.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అసలు నిజాలకు సమాధి కడుతున్నారు.
యుద్ధం అంటే సరదా కాదు. ప్రాణాలతో జూదం అనే సంగతి ఎవరూ గుర్తించడం లేదు. సాంకేతికత పెరిగిన తరుణంలో.. ఓ దేశం మరో దేశం మీద పై చేయి సాధించటానికి చాలా మార్గాలున్నాయి. కానీ అవన్నీ వదిలేసి యుద్ధాన్ని ఏకైక మార్గంగా చూడటం విడ్డూరంగా ఉంది. ఎవరేమనుకున్నా మా దారి మాదే అన్నట్టుగా మొండిపట్టుదలకు పోయి ప్రపంచంలో ప్రశాంతతకు అడ్రస్ లేకుండా చేస్తున్నారు. అసలు ఆధునిక ప్రపంచానికి యుద్ధాలు సూట్ కావని చెప్పేవారు చెబుతూనే ఉన్నారు. అయినా సరే మధ్యయుగాల నాటి ఆలోచనతో యుద్ధాలతోనే సమస్యల పరిష్కారమని నమ్మేవాళ్లు నమ్ముతూనే ఉన్నారు. పంతం, పట్టుదల, మంకుపట్టు, అహంకారం, గర్వం.. ఇలాంటి లక్షణాలన్నీ కలబోసుకున్న నేతలు పుట్టుకొచ్చి.. ఆయా దేశాల్ని నట్టేట్లో ముంచుతున్నారు. పచ్చగా ప్రశాంతంగా ఉన్న దేశాల్ని రోజుల వ్యవధిలోనే అల్లకల్లోలం చేస్తున్నారు. యుద్ధం మొదలుపెట్టే ముందు అంతా అండర్ కంట్రోల్ అని బిల్డప్ ఇస్తున్నారు. తీరా యుద్ధం మొదలయ్యాక.. ఎంత నష్టపోయినా పర్లేదనే భావనను ప్రజల మీద రుద్దుతున్నారు. అంతిమంగా యుద్ధం ఎలా ముగించాలో తెలియక చేతులెత్తేస్తున్నారు. పైగా కిందపడ్డా పైచేయి అన్నట్టుగా వ్యవహరిస్తూ.. ప్రపంచ శాంతికి సవాలు విసురుతున్నారు.
ఒక యుద్ధంతోనే ప్రపంచం వణికిపోతుంది. అలాంటిది యుద్ధం మీద యుద్ధం అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్న విషయం. పైగా ఏ యుద్ధానికీ అంతూ దరి కనిపించకపోవడం.. మరింత ప్రమాదకరం. అసలు యుద్ధాన్ని కోరి తెచ్చుకోకూడదు. సరే అనివార్య పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వచ్చినా.. దానికో కచ్చితమైన లక్ష్యం ఉండాలి. కానీ ఇటీవలి యుద్ధాలు మొదలైన కొద్దిరోజులకే అసలు లక్ష్యం నుంచి పక్కదోవ పట్టి.. రోజుకో కొత్త లక్ష్యాన్ని వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నాయి. కొన్ని దేశాలైతే.. యుద్ధం మొదలుపెట్టాక.. కారణాలు వెతుక్కుంటున్నాయి. ఏకపక్షంగా దాడి చేసి.. తర్వాత తీరిగ్గా సమర్థించుకుంటున్నాయి. ఇలాంటి పోకడలు చూస్తున్న ప్రపంచానికి.. ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో అనే దిగులు తప్పడం లేదు. ఇంత నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత కూడా.. ఇంకా ఎక్కువ మందిని చంపడమే గొప్ప అనుకునే ధోరణి ప్రబలడం.. అంతిమంగా ప్రజలకు పెనుముప్పు తెచ్చి పెడుతోంది. యుద్ధాల పేరుతో అధినేతలు ఇగోలకు పోతుంటే.. ఆయా దేశాల ప్రజలతో పాటు.. ప్రపంచ దేశాల పౌరులంతా ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలతో కునారిల్లుతున్నారు.
ప్రపంచీకరణ తర్వాత ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా.. మిగతా దేశాలపై ఆ ప్రభావం తప్పకుండా పడుతోంది. అయినా సరే ఎవరెలా పోతే మనకెందుకనే వైఖరితో కొన్ని దేశాలు సంక్షోభాలు కొనితెస్తున్నాయి. యుద్ధోన్మాదంతో కొత్త సమస్యలు కొని తెస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలు పరిష్కరించలేక ప్రపంచం సతమతమౌతుంటే.. అనుకోని యుద్ధాలు.. అవి రాజేసే కొత్త చిచ్చులు పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయి. అసలిలా యుద్ధాలు చేసుకుంటూపోతే.. ఇక మానవత్వం అనేది మిగులుతుందా అనేది పెద్ద చిక్కుప్రశ్నగా మారుతోంది.
మూడు సంవత్సరాలుగా ప్రపంచం యుద్ధాలతో అల్లకల్లోలంగా మారింది. 2020-2021లో కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికించింది. లక్షల ప్రాణాలు బలితీసుకుంది. ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. మన జీవన శైలినే మార్చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా రెండు మూడేళ్ల నుంచి యుద్ధోన్మాదంతో దేశాలన్నీ ఊగిపోతున్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ఎంతో కొంత దెబ్బ తీసింది. కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అహంకారం వల్ల వేల మంది సైనికులు, సామాన్య జనం చనిపోయారు. అది కొనసాగుతుండగానే మరోవైపు హమాస్ ఇజ్రాయెల్ పోరాటం మొదలైంది. అక్కడా వేలల్లో జనం చనిపోయారు. లక్షల కోట్ల ఆస్తి బూడిదైపోయింది. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు మళ్లీ ఇరాన్ యుద్ధం మొదలైంది. ఈ వరుస యుద్ధాలతో ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోయింది. లిబియా, ఇరాన్ ఆఫ్ఘాన్, కాంగో, హైతీ ఇవన్నీ యుద్ధాలతో కునారిల్లిపోయాయి.
ప్రస్తుతం ప్రపంచంలోని 97 దేశాలు ఏదో ఒకరకమైన సంఘర్షణల చట్రంలో చిక్కుకున్నాయి. వీటి కారణంగా 9.5 కోట్ల మంది శరణార్థులుగా మారారు. దాదాపు 16 దేశాల్లో 5 శాతానికిపైగా జనాభా బలవంతంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వచ్చింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత 17 ఏళ్లలో అంతర్యుద్ధాల కారణంగా మరణాలు 475 శాతం పెరిగాయి. 2018తో పోల్చితే ప్రపంచంలో ప్రస్తుతం ప్రశాంతత తక్కువగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. 2023లో 1.91 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ఇది అంతర్జాతీయ జీడీపీలో 13.5 శాతం. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి రూ. 2.06 లక్షల నష్టం వాటిల్లింది. ఏకంగా 86 దేశాలు సైన్యంపై చేస్తున్న ఖర్చులను పెంచుకున్నాయి. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే త్వరలో మరో అతిపెద్ద సంఘర్షణ తలెత్తే ప్రమాదముందని గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రపంచాన్ని హెచ్చరించింది.
ఒక్క 2022లోనే ఏకంగా రెండు లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. 1994లో జరిగిన రువాండా నరమేధం తర్వాత ఘర్షణల్లో అధిక సంఖ్యల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయింది ఆ సంవత్సరమే. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో 1,200 మంది మరణిస్తే, గాజాలో ఇజ్రాయెల్ కొనసాగించిన విధ్వంసంతో లక్ష మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ… రష్యాతో యుద్ధం తర్వాత 30 శాతం క్షీణించింది. సిరియాలో అంతర్యుద్ధం కారణంగా అక్కడి జీడీపీ 85 శాతం పడిపోయింది. మిలిటరీపై, ఆయుధాలపై దేశాలు చేసే ఖర్చు 2008 నుంచి 2024 మధ్య సరాసరిన 3.3 శాతం పెరిగింది. అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రిటన్‌లు మిలిటరీ, ఆయుధాలపై ఎక్కువగా ఖర్చు చేసినా… రష్యా మినహా మిగిలిన దేశాల్లో జీడీపీలో చేసే ఖర్చు తగ్గింది. రష్యా ఖర్చు మాత్రం ఏటా పెరుగుతూనే ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణ, ఇరాన్ యుద్ధం ఆధునిక యుద్ధాలు ఎంత ప్రమాదకరమైనవో చూపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రెండేళ్లుగా నెలకు 2 వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో 83 వేల మంది మరణించారు. గాజా సంఘర్షణలో 2023 అక్టోబరు నుంచి ఇప్పటివరకు 35 వేల మంది చనిపోయారు. ఇది అతిపెద్ద మానవ సంక్షోభంగా మిగిలింది. ఈ రెండు యుద్ధాలు నిరంతర యుద్ధాలుగా మారుతూ అంతం లేని పరిస్ధితుల్లోకి వచ్చాయి.
ఇక ఇరాన్ యుద్ధం అయితే ఊహించని రీతిలో పెద్దదౌతోంది. ఓవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం తీవ్రస్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి. దీంతో రెండువైపులా తీవ్ర నష్టం జరుగుతుంది. మరోవైపు ఈ యుద్ధంలోకి అమెరికా ఎంటరైంది. దీంతో ఈ యుద్ధం రాబోయే రోజుల్లో ఎలా పరిణమిస్తుందనేది ఊహించడం కూడా కష్టంగా మారింది. ఇప్పటికే తన ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరుగుతున్నా.. ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగడంతో.. ఇరాన్ ను పూర్తిస్థాయిలో నాశనం చేసే దాకా నిద్రపోకపోవచ్చు. ఇరాన్ కు అంత నష్టం జరిగే పరిస్థితి వస్తే.. పశ్చిమాసియాలో మిగతా దేశాలు ఏం చేస్తాయి.. రష్యా, చైనా ఎలాంటి వైఖరి తీసుకుంటాయనేది కూడా యుద్ధ గమనాన్ని నిర్దేశిస్తుంది. అలా యుద్ధం పెద్దదయ్యే కొద్దీ ఊహించని సంక్షోభాలు తరుముకొస్తాయి.
కొన్ని నెలల క్రితం పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఏ క్షణమైనా యుద్ధం అనే పరిస్థితి వచ్చి.. ఉద్రిక్తతలు కేవలం నాలుగు రోజుల్లో సద్దు మణిగాయి. ఆ నాలుగు రోజులకే రెండు దేశాలకూ భారీగా చేతి చమురు వదిలిందని యూఏఈకి చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. రోజుకు రూ. 1400 నుంచి 5 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ఓ అంచనా. భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధం అంటే ఆషామాషీ కాదు. బలగాలు సరిహద్దులకు తరలించడం, ఆపై ఆయుధాలు సప్లై చేయడం, మిస్సైళ్ల ఎటాకింగ్, ఆపై ట్రాన్స్‌పోర్టు. ఇవికాకుండా సైన్యానికి ఎప్పటికప్పుడు ఆహారం, మందులు సరఫరా చేయడం చిన్న పని కాదు. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో దాయాది దేశం పాక్ కంటే భారత్ ఖర్చు ఎక్కువే. అదే దీర్ఘ కాలిక యుద్ధం అయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయమనే వాదనలు వినిపించాయి.
ఒకవేళ దాయాదుల మధ్య నెల రోజుల పాటు యుద్ధం జరిగితే.. కలిగే నష్టం ఏకంగా రూ.43 లక్షల కోట్లు ఉంటుందని నివేదిక వచ్చింది. అంటే దేశ జీడీపీలో దాదాపు 20 శాతం అన్నమాట. ఒక్క నెల రోజుల యుద్ధానికే నిధులు మొత్తం తుడిచి పెట్టుకుపోవచ్చని ప్రస్తావించింది. దీనివల్ల మార్కెట్లు కుప్పకూలడంతో పాటు విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. IMF డేటా ప్రకారం.. 2025లో భారతదేశ జీడీపీ వృద్ధి 6.2 శాతం. దాని విలువ అక్కరాలా 4.39 ట్రిలియన్ల డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా. ఇక పాకిస్తాన్ GDP వృద్ధి కేవలం 2.6 శాతం మాత్రమే. దాని విలువ 337.75 బిలియన్ డాలర్లు. పూర్తిస్థాయి యుద్ధం భారత్ కు 1.8 బిలియన్ డాలర్లు, పాకిస్తాన్‌కు 1.2 బిలియన్ డాలర్ల నష్టాన్ని కలిగిస్తుందనేది ప్రాథమిక అంచనా.
పాకిస్తాన్‌తో భారత్ ఇప్పటివరకు అనేక యుద్ధాలు చేసింది. 1971 పాకిస్థాన్ వార్‌లో వారానికి రూ.200 కోట్లు ఖర్చు అయినట్లు ఓ అంచనా. 1999 కార్గిల్ యుద్ధంలో రోజుకు రూ.10-15 కోట్లు రూపాయలు ఖర్చయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇవి కాకుండా వైమానిక ఖర్చులు అదనం. ఇలా రోజురోజుకీ యుద్ధానికి అయ్యే ఖర్చుతో పాటు జరిగే నష్టం కూడా ఊహించని రీతిలో పెరిగిపోతోంది. అయినా సరే ప్రపంచ దేశాలు ఎక్కడా తగ్గకుండా అమీతుమీ తేల్చుకోవడానికి సుముఖత చూపుతున్నాయి. ఎక్కువ భూమి ఉండటమే ఆధిపత్యానికి ఏకైక నిదర్శనంగా ఉన్న కాలంలో కూడా రాజులు నిరంతర యుద్ధాలు చేసినా.. జనావాసాలకు దూరంగా పోరాడి.. సాధారణ పౌరులకు తక్కువ నష్టం కలిగేలా జాగ్రత్తపడేవారు. కానీ ఇప్పుడు ఆధునిక ప్రపంచానికి ఆ స్పృహ కూడా లేకుండా పోతోంది. ఎటూ సైనికులు పోతున్నారు. పైగా యుద్ధాల్లో పాల్గొనే దేశాల పౌరులకు నష్టాలు తప్పడం లేదు. అంతవరకు ఓ ఎత్తైతే.. అసలు యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాల్లో పౌరులు కూడా యుద్ధ నష్టాల్ని పరోక్షంగా భరించాల్సి రావడం పెద్ద విషాదం. అందుకే ఎక్కడో రెండు దేశాలు యుద్ధం చేస్తుంటే.. మిగతా ప్రపంచ దేశాల జీడీపీ తగ్గిపోతోంది. ప్రజల వాస్తవాదాయాలు దారుణంగా పడిపోతున్నాయి. వీటిని చూపించి ప్రపంచ సంస్థలన్నీ మొత్తుకుంటున్నా.. ప్రపంచ దేశాలు యుద్ధోన్మాదం నుంచి బయటపడలేక.. వాటితో పాటు అందర్నీ ముంచేస్తున్నాయి.
ఏ యుద్ధమూ చివర్లో శాంతిని ఇవ్వదు. యుద్ధంలో ఎవరు గెలిచి ఎవరు ఓడిపోయినా కష్టాలన్నీ సామాన్య జనానికే. కేవలం అమెరికా లాంటి దేశాలు ఆయుధాలు అమ్ముకోవడానికి మాత్రమే యుద్ధాలు ఉపయోగపడతాయి. ఎవరో ఒకరు బాగుపడడం కోసం ప్రతీ యుద్ధంలోనూ సామాన్యులు బలైపోతూ ఉంటారు. ఇవాళ ఇజ్రాయెల్ యుద్ధానికి ఒక రోజుకు అవుతున్న ఖర్చు రెండు లక్షల 25 వేల కోట్లు. ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకోవడానికి మొత్తం ఖజానానే ఇజ్రాయెల్ ఖాళీ చేసుకుంది. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కారణంగా 10 లక్షల మంది ఆ దేశం విడిచి వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఇంత పెద్ద మానవ విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు. సోవియట్ పతనం తర్వాత ఇన్నేళ్లుగా ఉక్రెయిన్ సాధించిన అభివృద్ధి.. బాంబుల వర్షంతో ధ్వంసమైంది. ఇప్పుడు ఉక్రెయిన్ పునర్నిర్మాణం ప్రపంచానికే అతి పెద్ద సవాల్. ఇంత చేసి రష్యా కూడా సాధించేదేమీ ఉండదు. ప్రపంచ దేశాల ఆంక్షలకు తాము సిద్ధంగా ఉన్నామని పైకి గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నా.. సొంత దేశంలో రష్యాకు ఈగల మోత తప్పడం లేదు. ఇప్పటికే ఏటీఎంలో డబ్బులు నిండుకున్నాయి. సూపర్ మార్కెట్లలో సరుకుల్లేవు. నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. పౌరుల్లో కూడా అసహనం పెరిగిపోతోంది. అనవసర యుద్ధం తెచ్చిపెట్టారని అటు సైనికులు.. ఇటు పౌరులు క్రెమ్లిన్ పై విరుచుకుపడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ప్రజాగ్రహాన్ని చల్లార్చలేక మాస్కో పోలీసులు కూడా అవస్థలు పడుతున్నారు. గాజాపై సంపూర్ణ విజయం అనే మాటకు కట్టుబడి ఉండేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కష్టపడాల్సి వస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరు దాని మిత్రదేశం అమెరికా కూడా ఎదురుతిరిగేలా చేస్తోంది. ఇరాన్ యుద్ధం అనూహ్యంగా తీవ్రమౌతున్న తీరు.. ప్రపంచాన్ని మరోసారి ప్రమాదపుటంచుల్లో నిలబెడుతోంది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. యూరప్ కు శరణార్థి సంక్షోభం మొదలైంది. ఆయిల్, గ్యాస్, ఆహార సంక్షోభాలు తరుముకొస్తున్నాయి. యుద్ధం ఎలా ముగుస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కారణంగా 10 లక్షల మంది ఆ దేశం విడిచి వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఇంత పెద్ద మానవ విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు. సోవియట్ పతనం తర్వాత ఇన్నేళ్లుగా ఉక్రెయిన్ సాధించిన అభివృద్ధి.. బాంబుల వర్షంతో ధ్వంసమైంది. ఇప్పుడు ఉక్రెయిన్ పునర్నిర్మాణం ప్రపంచానికే అతి పెద్ద సవాల్. ఇంత చేసి రష్యా కూడా సాధించేదేమీ కనిపించటం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మొండి పట్టుదలతో ప్రపంచాన్ని యుద్ధభయంలోకి నెట్టేశారు. యుద్ధాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం యుద్ధాలు వ్యూహాత్మకంగా చేయాలి. అంతేకానీ సైనిక బలం ఉందనే ఆలోచనతో గుడ్డిగా యుద్ధం చేస్తే ఎదురుదెబ్బలు తప్పవు. ఈ కారణంగానే అటు రష్యా, ఇటు ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాలు సాధించకపోగా.. కొత్త సమస్యలు కొనితెచ్చుకున్నాయనటంలో సందేహం లేదు. యుద్ధాల కారణంగా తాము నష్టంతో పాటు మొత్తం ప్రపంచానికి చేటు చేస్తున్నారు. పైగా శాంతి పిలుపుని తిరస్కరిస్తూ.. మరింతగా బరితెగిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా నిస్సహాయంగా మిగిలిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఇలాగైతే భవిష్యత్తులో ఏ యుద్దం ఎటైనా దారితీసే ప్రపంచ యుద్దంగా మారొచ్చనే భయాలు లేకపోలేదు. ఎవరేమనుకున్నా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లంటున్న దేశాలు.. ఎవరి మాటలూ వినిపించుకునే స్థితిలో లేవు. అంతిమ లక్ష్యం పేరుతో గుడ్డిగా యుద్ధం చేస్తున్నాయి. ఎన్ని మరణాలు సంభవించినా.. ఎంత ఆర్థిక నష్టం జరిగినా.. గెలుపు చివరి అంచును చేరితీరాలనే మొండి పట్టుదలతో కనిపిస్తున్నాయి.
యుద్ధాల్లో ఓటమి అంచుకు చేరిన దేశాల్లోనే కాదు.. గెలిచి వికటాట్టహాసం చేసే దేశాల్లోనూ కొన్ని సీన్లు కామన్ గా ఉంటాయి. సైనికుల్ని కోల్పోయిన కుటుంబాల కన్నీటిగాథలు ఎక్కడైనా ఒక్కటే. అలాగే యుద్ధం తర్వాత లక్షల మంది పౌరుల జీవనోపాధి పోతుంది. మళ్లీ కొత్త జీవితం మొదలుపెట్టడమంటే.. ఇంకో జన్మ ఎత్తినట్టే. ఈ ప్రాసెస్ లో ఆత్మహత్యలు, హత్యలు కూడా జరుగుతాయి. ఇంకా అంతులేని విషాదాలు కొన్ని తరాల వరకు వెంటాడుతూనే ఉంటాయి. ప్రపంచ యుద్ధాలు ముగిసి శతాబ్దం దగ్గరపడుతున్నా కూడా.. ఇప్పటికీ వాటి ప్రభావం కొన్ని దేశాలపై ఉందనే మాట చేదు వాస్తవం. ఆయా దేశాలు పడుతున్న బాధలు కళ్లారా చూసిన తర్వాత కూడా కొన్ని దేశాలు యుద్ధాలకు కాలుదువ్వటం.. ఓయుద్ధంలో చేతులు కాలాక కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా మరో యుద్ధానికి సిద్ధం కావడం చేస్తూనే ఉన్నాయి.
నిజానికి యుద్ధాల్ని సామాన్యులు ఎవరూ కోరుకోవడం లేదు. కేవలం కొందరు దేశాధినేతలే అహంకారంతో విర్రవీగుతున్నారు. యుద్ధాలు అంటే టైమ్ వేస్టేనని మెజార్టీ ప్రజలు భావిస్తున్నా కూడా.. వారి ఆలోచనకు ఎలాంటి విలువ లేకపోవడమే అసలు విషాదం. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా యుద్ధాల్ని దేశాల మీద రుద్దుతున్న అధినేతలు.. అదే ప్రజల్ని కడగండ్ల పాలు చేస్తున్నారు. అలాగని శాంతి కోసం ప్రయత్నాలు జరగడం లేదని చెప్పటానికి లేదు. యుద్ధాలు ఎంత ఉధృతంగా జరుగుతున్నాయో.. శాంతి ప్రయత్నాలు కూడా అంతే ముమ్మరంగా సాగుతున్నాయి. కాకపోతే కొండను తవ్వారు ఎలుకను కూడా పట్టలేకపోయారు అన్న చందంగా చర్చల ఫలితాలు ఉంటున్నాయి. కేవలం పేరుకి మాత్రమే శాంతి చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చల్లో కూడా ఏ పక్షమూ రెండడుగులు వెనక్కి వేయటానికి సిద్ధపడటం లేదు. అక్కడ కూడా యుద్ధ రంగంలో చూపే ఆధిపత్యమే చూపుతున్నాయి. పైగా మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు కూడా ఒక్కోసారి మొండి పట్టుదలకు పోతున్నాయి. ఏదోలా సంధి కుదురుద్దామనే ఆలోచన వదిలేసి.. మా మాట విననప్పుడు ఎవరెలా పోతే మాకెందుకు అని పంతం పడుతున్నాయి. దీంతో చివరకు శాంతి చర్చల వేదికల ఎంపిక కూడా సంక్లిష్టంగా మారుతోంది. ఇదే పోకడ కొనసాగితే.. ప్రపంచంలో చివరకు యుద్ధాలతో సతమతమయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే యుద్ధం ఎవరు చేసినా వ్యతిరేకించాల్సిందే. ఎవరూ యుద్ధం జోలికి పోకూడదు. ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగిన ఏ యుద్ధమూ సామాన్యుని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. కేవలం అధినేతల అహం తృప్తి పరచడం కోసం వేలాది మంది సైనికులు బలైపోయి.. కోట్ల మందికి కన్నీళ్లు మిగిల్చే అరాచకానికి ఇకనైనా ముగింపు పలకాల్సిందే. ఇదీ ఈవారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.