Site icon NTV Telugu

Chairman’s Desk : పేదరికం లేని రాష్ట్రం ఎలా సాధ్యమైంది? వరుస విజయాల వెనకున్న కథేంటి?

Keralam

Keralam

కేరళం అసెంబ్లీ ఎన్నికల్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. పదేళ్ల ఎల్‌డీఎఫ్ పాలన కొనసాగుతుందా? లేక పదేళ్ల పాలనతో విసిగిపోయి జనం మరోపార్టీకో, కూటమికో అవకాశం ఇస్తారా అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాబోయే కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా గెలవొచ్చు.. ఓడిపోవచ్చు. కానీ ఈ సందర్భంగా కేరళం అభివృద్ధిని, అక్కడి సామాజిక పరిస్థితిని, దేశానికే రోల్ మాడల్‌గా మారిన పాలనా వ్యవహారాలను కచ్చితంగా ఇప్పుడు అందరూ అధ్యయనం చేయాల్సిందే. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్‌ చూద్దాం.

దేశంలో కేరళం మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్. విద్య, ప్రజా చైతన్యం, అభివృద్ధి, గ్రామీణ జీవితం, స్త్రీ పురుష నిష్పత్తి, ప్రజారోగ్యం, ప్రజల పరిణతి… వీటన్నిటిలోనూ కేరళం దేశంలో మిగిలిన ప్రాంంతాలకు ఒక అధ్యయన కేంద్రం లాంటిది. పంచాయతీరాజ్ వ్యవస్థ కిందివరకు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కేరళం. అలాగే, వెయ్యి మంది మగపిల్లలకు 1084 ఆడపిల్లల్ని కంటూ.. ఎటువంటి స్త్రీ వివక్ష లేని రాష్ట్రంగా కేరళం ప్రథమ స్థానంలో నిలబడింది. స్త్రీ పురుష నిష్పత్తిలో దేశంలో వెయ్యిమంది మగపిల్లలకు 951 మంది మాత్రమే ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ, కేరళం ఇందుకు పూర్తిగా భిన్నం. దీనికి ప్రధాన కారణం.. 96.2 అక్షరాస్యత శాతం. అలాగే కేరళం జీవన ప్రమాణాల విషయంలో కూడా మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ముందుంది.

కేరళం అభివృద్ధి నమూనా, ప్రపంచవ్యాప్తంగా కేరళం మోడల్ గా ప్రసిద్ధి చెందింది. తక్కువ తలసరి ఆదాయం ఉన్నప్పటికీ, విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో సమానమైన ఫలితాలను సాధించింది. దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళం నిలుస్తోంది. ఇది ఇక్కడి విద్యా వ్యవస్థ సాధించిన గొప్ప విజయం. అలాగే ఆరోగ్యపరంగా తక్కువ శిశు మరణాల రేటు, అత్యధిక సగటు ఆయుర్దాయం, మెరుగైన మాతా శిశు ఆరోగ్య సేవలు కేరళం మోడల్ ప్రధాన బలాలు.

కేరళం ఆర్థిక వ్యవస్థలో దాదాపు 63 శాతం వాటా సేవా రంగానిదే. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరుగాంచిన కేరళంలో పర్యాటక రంగం ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఊతంగా నిలుస్తోంది. గత దశాబ్ద కాలంగా రోడ్లు, వంతెనలు, ఐటీ పార్కులు, విద్యాసంస్థల ఆధునీకరణపై కేరళం ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టింది. కేరళం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్ ద్వారా నిధుల సమీకరణ చేపట్టారు.
దీంతో పాటు భూసంస్కరణలు, సంక్షేమ పథకాల ద్వారా వనరులను ప్రజలందరికీ సమానంగా అందేలా చూడటం కేరళం ప్రత్యేకత.

స్థానిక సంస్థలకు విస్తృత అధికారాలు ఇవ్వడం ద్వారా గ్రామ స్థాయిలోనే అభివృద్ధి ప్రణాళికలు అమలవుతున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కేరళంలో పట్టణాలకు, గ్రామాలకు మధ్య అభివృద్ధి పరమైన వ్యత్యాసాలు చాలా తక్కువ. నీతి అయోగ్ నివేదికల ప్రకారం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కేరళం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పారిశ్రామిక పార్కులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగని కేరళానికి కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం, మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించడం ఆ రాష్ట్రానికి ప్రధాన సవాళ్లు.

ప్రణాళికా సంఘం రద్దు తర్వాత 18 ప్రధాన రాష్ట్రాలలో కనిపించిన క్షీణత ధోరణికి విరుద్ధంగా, అధికారిక ప్రణాళికా ప్రక్రియను కొనసాగించిన ఏకైక రాష్ట్రంగా కేరళం ప్రత్యేకతను చాటుకుంది. దీనివల్ల 2017 నుండి మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. కేరళ వృద్ధి రేట్లు జాతీయ సగటుకు సమానంగా, కొన్ని సంవత్సరాలలో అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం ఒక కొత్త వృద్ధి పథంలోకి వచ్చింది. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వాటా కంటే, వారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన బడ్జెట్ నిధుల వాటా నిరంతరం ఎక్కువగా ఉంది.

కేరళంలో జిల్లా సహకార బ్యాంకులను ఒకే సంస్థగా ఏకీకృతం చేయడం ద్వారా కేరళం బ్యాంక్ ఏర్పడింది. ఈ చర్య ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసింది, గ్రామీణ రుణాలను విస్తరించింది. ప్రజల కేంద్రీకృత అభివృద్ధి బ్యాంకుకు మార్గం సుగమం చేసింది. పాఠశాల మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల అభివృద్ధి, పాఠ్యప్రణాళిక పునరుద్ధరణ మరియు ఐటీ ఆధారిత అభ్యసనంపై భారీ పెట్టుబడులు పెట్టింది కేరళం. ప్రిపరేటరీ, మిడిల్-స్కూల్ స్థాయిలో సున్నా శాతం డ్రాపౌట్‌తో, రాష్ట్రం సార్వత్రిక, ఉచిత ప్రాథమిక విద్యను అందిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులలో డ్రాపౌట్ రేట్లు కూడా దేశంలోనే ఇక్కడే అత్యల్పంగా ఉన్నాయి. పాఠశాల విద్యలో కేరళం దేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ రాష్ట్రం కూడా. ఉన్నత, సాంకేతిక విద్యలో, బలమైన ప్రభుత్వ పెట్టుబడులతో పాటు పరిపాలన, పాఠ్యప్రణాళిక, సంస్థాగత నిర్మాణాలలో సంస్కరణలు జరిగాయి. ఈ ప్రయత్నాలన్నీ కేరళంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల జాతీయ ర్యాంకింగ్‌లు మెరుగుపడటానికి దోహదపడ్డాయి. కేరళం మొదట్నుంచీ అధిక అక్షరాస్యత, మహిళా అక్షరాస్యతకు పెట్టింది పేరు.

చారిత్రకంగా కేరళంలో మరణాల రేటు ఎల్లప్పుడూ తక్కువగా ఉండేది. శిశు మరణాల తగ్గింపులోనూ కేరళం గణనీయ పురోగతి సాధించింది. ఇది దేశం మొత్తంతో పోలిస్తే 4 రెట్లు తక్కువ. కొరియా, పనామా, యుగోస్లేవియా, శ్రీలంక, కొలంబియా వంటి దేశాలతో పోల్చదగిన శిశుమరణాల రేటు కేరళంలో కనిపిస్తుంది. ఇక 0-4 సంవత్సరాల వయస్సులో ఆడపిల్లల మరణాలు కూడా తక్కువే. 1930లో దేశంతో సమానంగా ఉన్న కేరళం ఆయుర్దాయం, ప్రస్తుతం దేశం కంటే 12 సంవత్సరాలు ఎక్కువగా ఉంది. మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉంది. 1981లో లింగ నిష్పత్తి 1032 కాగా, భారతదేశంలో ఇది 935గా ఉంది. 1985లో కేరళ దాదాపు పునఃస్థాపన స్థాయికి చేరుకుంది. స్థూల జనన రేటు దేశంలో 32 కాగా, కేరళలో ఇది 21 గా ఉంది. కేరళంలో 76 శాతం మంది ఆసుపత్రిలో ప్రసవిస్తున్నారు. వివాహ వయస్సు పెరగడం, చిన్న కుటుంబ నియమం, మహిళల విద్య మెరుగుపడటం, మహిళలకు ఎక్కువ నిర్ణయాధికారం లభించడం, ఆరోగ్య సంరక్షణ లభ్యత వంటి సామాజిక-ఆర్థిక కారకాల వల్ల కేరళంలో పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది.

మానవాభివృద్ధిలో అసలైన ఆర్థికాభివృద్ధి సాధ్యమౌతుందని కేరళం దేశానికి నిరూపించింది. పార్టీలు, కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా కేరళం సాధించిన పురోగతి నిస్సందేహంగా అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమే. ఇక్కడ అన్ని రంగాలూ ప్రగతి పథంలో పయనించడం ఓ ఎత్తైతే.. మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి దశాబ్దాల తరబడి స్థిరంగా కొనసాగించడం కచ్చితంగా అద్భుతమే. దేశంలోనే ప్రత్యేకమైన పాలనా విధానం, ఎక్కడా లేని విధంగా ఇక్కడ సామాజిక జీవనంలో మహిళల పాత్ర వెరసి.. కేరళంను విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశాయి.

ప్రపంచంలో ఎక్కడ చూసినా పేదరికం సామాజిక ఆర్థిక సమస్య. అదొక విష వలయం. సమాజాన్ని రెండు వర్గాలుగా విడదీసే ఒక దుస్థితి. అందుకని పేదరిక నిర్మూలనే ప్రభుత్వాల అంతిమ లక్ష్యం కావాలి. కానీ ఇంకా అందరి ఆలోచనల్లోనే ఉన్న ఈ లక్ష్యాన్ని కేరళం నిజం చేసి చూపించి.. దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. దుర్భర దారిద్య్రంపై విజయం సాధించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దేశంలో పేదరిక నిర్మూలన నినాదం అయిదో పంచవర్ష ప్రణాళిక కాలం నుంచే ప్రారంభమైంది. అయినా సరే దేశంలో ఇప్పటికీ ఇరవై కోట్లకుపైగా పేదలున్నారని అంచనా. దేశంలో వివిధ రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం విభిన్న నమూనాలను అనుసరిస్తున్నాయి. ఆ క్రమంలో అక్షరాస్యత మెరుగుదలలో, మానవాభివృద్ధి సూచీలో, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో, జీవన ప్రమాణాలలో ముందున్న రాష్ట్రంగా కేరళం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడుతూ- అత్యంత పేదరికాన్ని పారదోలినట్లు ప్రకటించారు. దీంతో కేరళం కల లాంటి మైలురాయిని అందుకుని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లయింది.

సాధారణంగా ఆహారం, ఆరోగ్యం, నివాసం, విద్య, తాగునీరు లాంటి ప్రాథమిక అవసరాలు కూడా అందని దుస్థితినే అత్యంత పేదరికంగా భావిస్తారు. ప్రతి అయిదేళ్లకు ఒకసారి ప్రభుత్వాల్ని మార్చే సంప్రదాయం ఉన్న కేరళంలో.. మానవాభివృద్ధి విషయంలో ఎవ్వరూ రాజీపడలేదు. 0.55శాతం దారిద్య్రంతో దేశంలో అతి తక్కువ పేదరికం కలిగిన మొదటి రాష్ట్రంగా కేరళం నిలిచిందని 2023లోనే నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. కేరళం సర్కారు దుర్భర దారిద్య్రాన్ని నిర్మూలించడానికి ఎంపిక చేసిన మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల్లో పైలట్‌ ప్రాజెక్టును అమలు చేసి సానుకూల ఫలితాలు సాధించింది. ఆ తరవాత ఆదాయం, ఆహారం, ఆరోగ్యం, నివాసం, అవిద్య, ఉపాధి ప్రమాణాలుగా రాష్ట్రవ్యాప్తంగా అత్యంత పేదరికంలో ఉన్న 64,006 కుటుంబాలను గుర్తించారు. ఆపై ప్రణాళికాబద్ధంగా శ్రమించి 1,03,099 మందిని దుర్భర దారిద్య్రం నుంచి బయటపడేశారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఒక్కో సూక్ష్మ ప్రణాళికను రూపొందించి పక్కా ఇళ్లు, భూ పంపిణీ, రేషన్‌ కార్డులు, పింఛన్లు, ప్రజారోగ్య కేంద్రాల ఏర్పాటు, ఉచిత వైద్య బీమా, పరిశుద్ధమైన తాగునీరు వంటి సౌకర్యాలు అందజేసింది. తద్వారా కేరళం దేశంలోనే దుర్భర దారిద్య్రాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ ఘనతను సాధించడంలో స్థానిక సంస్థల పాలనా వ్యవస్థ సమర్థంగా పనిచేసిందని చెప్పాలి. సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌తోనే కేరళ అనేక సామాజిక, ఆర్థిక సూచీలలో మెరుగైన స్థానాల్లో ఉంటూ అత్యంత పేదరికంపై విజయం సాధించడం అభినందనీయం. అంతకన్నా అధిక బడ్జెట్‌ ఉండే రాష్ట్రాల్లో ఇంకా పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉండటం.. కేరళం ప్రత్యేకతను చాటుతోంది.

కేరళం ప్రత్యేక లక్షణాలలో ఒకటి అధిక మహిళా అక్షరాస్యత. దీంతో పాటు నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల అనుకూల స్థానం మాతృస్వామ్య వారసత్వ పద్ధతి సమాజ వికాసానికి గణనీయంగా తోడ్పడింది. పేదలు, అణగారిన వర్గాల హక్కుల విషయంలో కూడా కేరళం ఎక్కడా రాజీపడలేదు. కేరళం ప్రభుత్వ ఆదాయంలో అత్యధిక భాగం విద్యపై, ఆ తర్వాత ఆరోగ్యంపై ఖర్చు చేసే సంప్రదాయం తొలి నుంచీ ఉంది. అందుకే కేరళంలో ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, నేతలు మారినా.. ప్రాథమిక పాలనా విధానం మారలేదనే వాదన వినిపిస్తోంది. మిగతా దేశానికి భిన్నంగా కేరళంలో ప్రజలు సంక్షేమ పథకాల కంటే.. తమ జీవితాన్ని ప్రభావితం చేసే.. తమను జీవితంలో మరో మెట్టు ఎక్కించే విధానాల కోసమే ఎక్కువగా చూస్తారు. పైగా కేరళంలో రాష్ట్ర ప్రభుత్వం కంటే ప్రజలపై స్థానిక సంస్థల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కడికక్కడే పాలనా వికేంద్రీకరణతో.. స్థానిక సంస్థలు ఒకదానితో మరొకటి పోటీపడి మెరుగైన ఫలితాలు సాధిస్తుంటాయి. పంచాయతీరాజ్ పాలనలో కేరళం సర్కారు ేజోక్యం చేసుకోకపోవడం, స్థానిక సంస్థలకు నిధుల విడుదల విషయంలో ఉదారంగా ఉండటం.. కూడా కేరళం స్వావలంబనకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు.

రాజ్యాంగ నిర్మాతలు కలలు కన్న గ్రామస్వరాజ్యం కూడా కేరళంలో కన్నుల పండువగా కనిపిస్తుంది. కేరళం పాలనా విధానమే ఆ రాష్ట్రం ప్రగతి పథంలో నిలవటానికి మూలకారణమని అక్కడి ప్రజలు కూడా ఒప్పుకుంటారు. కేరళంలో మిగతా దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా సేవా, పారిశ్రామిక రంగాలు బలంగా వేళ్లూనుకోలేదు. అలాగని అసలు లేకుండానూ లేవు. అదే సమయంలో వ్యవసాయంతో పాటు మత్స్య సంపద కూడా పుష్కలంగా ఉంది. ఇలా సమగ్ర సమ్మిళిత అభివృద్ధి నమూనాతో కేరళం ప్రజలు మెరుగైన జీవనాన్ని ఆస్వాదిస్తున్నారు. దీనికి తోడు దేవుడిచ్చిన పర్యాటక సంపద, గల్ఫ్ నుంచి కేరళం ప్రవాసులు పంపే డబ్బు.. ఆ రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని అందిస్తున్నాయి. దీంతో ఏమైనా ప్రకృతి విపత్తులు వచ్చినా.. మరేదైనా ఆర్థిక సమస్యలు వచ్చినా.. కేరళం వేగంగా కోలుకోగలుగుతోంది.

బోధనానైపుణ్యం ఉన్న టీచర్లు, అంకిత భావం గల నర్సులకు కేరళం ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఈ రెండు ప్రొఫెషన్‌లకు సంబంధించి మిగతా వారికి వచ్చే ఆదాయంతో పోలిస్తే.. కేరళం వాసులు కాస్త ఎక్కువే అందుకుంటారనడంలో సందేహం లేదు. కొన్ని సంస్థలైతే ప్రత్యేకంగా కేరళం టీచర్లు, నర్సులే కావాలని ప్రకటనలు ఇవ్వడం కూడా మనకు అనుభవంలో ఉన్న విషయమే. కేరళం టీచర్లు ఎక్కువగా ఉన్న స్కూళ్లు.. మిగతావాటికి భిన్నంగా మెరుగైన ఫలితాలు సాధించడం.. అలాగే కేరళం నర్సులు ఎక్కువగా ఉన్న ఆస్పత్రులకు రోగుల నుంచి మెరుగైన రేటింగులు రావడం సర్వసాధారణం.

ఇప్పుడు ప్రపంచమంతా కేరళం వైపు చూస్తోంది. విద్య, వైద్యారోగ్యం, ఐటి, సహకార రంగం, పారిశ్రామిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, ప్రజాసంక్షేమం, సామాజిక చైతన్యం ఇలా అన్ని రంగాల్లోనూ కేరళం గణనీయమైన పురోగతి సాధించింది. 1956లో కేరళం రాష్ట్రంగా ఏర్పడినప్పుడు, అది దేశంలోని అత్యంత పేద ప్రాంతాలలో ఒకటిగా ఉండేది. నేడు అది దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. అంతేకాదు సమీప భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాల జీవన ప్రమాణాలను సాధించడానికి అత్యంత అనుకూలమైన స్థితిలో ఉన్న రాష్ట్రం కూడా కేరళమే. ఈ అద్భుతమైన మార్పుకు ప్రధాన కారణం, దశాబ్దాలుగా కేరళం రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అధిక స్థాయి సామాజిక వ్యయం. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలు కలిసి పనిచేసి.. ప్రజాకార్యచరణ శక్తిని సమష్టిగా చాటాయి.

1970వ దశకం నాటికే, కేరళం భూ సంస్కరణలు, సాధారణ విద్య, ప్రజారోగ్యం వంటి రంగాలలో, అలాగే కుల, లింగ అసమానతలను తగ్గించడంలో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. ఆ సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఈ విజయాల సాధనకు అది అడ్డు కాలేదు. కేరళం అనుసరించిన అభివృద్ధి ప్రయాణాన్ని అనేక అధ్యయనాలు గుర్తించాయి. వాటిలో కొన్ని దీనిని ఒక ఆదర్శంగా కూడా పేర్కొన్నాయి. కేరళం అనుభవాన్ని ఉదహరిస్తూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం, విద్యను పొందడం, రాజకీయ చర్చలలో పాల్గొనడం వంటి సార్వత్రిక స్వేచ్ఛల విస్తరణ కోసం ఆదాయాలు అధిక స్థాయికి చేరే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని అమర్త్య సేన్ గతంలో వాదించారు.

1980వ దశాబ్దం చివరిలో కేరళం ఆర్థిక వ్యవస్థ వేగవంతమైంది. నేటికీ వేగంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆర్థిక వృద్ధికి ముందు సామాజిక అభివృద్ధి జరగడమే కాకుండా, మెరుగైన ఆర్థిక వృద్ధికి ఆ సామాజిక అభివృద్ధి ప్రేరణను అందించింది కాబట్టే కేరళం అనుభవం ప్రత్యేకంగా నిలుస్తుంది. కేరళం విజయాల్లో కుటుంబశ్రీ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1998లో మొదలైన ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన నెట్‌వర్క్‌లలో ఒకటే కుటుంబశ్రీ. ఇది మహిళా సంఘాలు, సూక్ష్మ ఆర్థిక సంస్థలు, స్థానిక స్వయం-ఉపాధి పథకాల ద్వారా గ్రామీణ, పట్టణ పేదరికానికి వ్యతిరేకంగా పోరాడుతూ అద్భుతమైన విజయాన్ని సాధించింది. కుటుంబశ్రీ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను సంఘటితం చేసి, వారిలో నాయకత్వ లక్షణాలను, ఆర్థిక స్వాలంబనను పెంపొందించింది. సంఘాల ద్వారా మహిళలకు సులభంగా రుణాలు అందించి, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు నెలకొల్పేలా ప్రోత్సహించింది. కేటరింగ్, వ్యవసాయం, చేతిపనులు, వస్త్రాల తయారీ వంటి రంగాలలో కుటుంబశ్రీ మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. పేదరిక నిర్మూలనతో పాటు, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, సామాజిక న్యాయం కోసం ఈ వ్యవస్థ కృషి చేస్తోంది. మొత్తం మీద కుటుంబశ్రీ, కేరళంలో మహిళల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులను మార్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది.

గల్ఫ్ నిధులు కేరళం ఆర్థికవ్యవస్థకు వెన్నెముక వంటివి. 2023లో, కేరళం సుమారు రూ.2,16,893 కోట్ల నిధులను అందుకుంది, ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన భాగం. ఈ నిధులు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటును అందించడమే కాకుండా, రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించడంలో, వినియోగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశానికి వచ్చే మొత్తం ప్రవాస నిధులలో కేరళం వాటా 19.7 శాతం. ఈ నిధులు ఎక్కువగా మలప్పురం, త్రిశూర్, కోజికోడ్, కన్నూర్ జిల్లాలలోని స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలపరుస్తున్నాయి. గల్ఫ్ నిధులు విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సహాయపడ్డాయి. అయితే ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం కారణంగా, ప్రవాసుల సంఖ్యలో తగ్గుదల వంటివి ఈ నిధుల ప్రవాహానికి ముప్పు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా, యుద్ధం కారణంగా గల్ఫ్ నిధుల ప్రవాహంలో 20 శాతం వరకు తగ్గుదల ఉండే అవకాశం ఉందని అంచనా. గల్ఫ్ నిధుల ప్రవాహం.. కేరళంలో వ్యక్తిగత సంపదను పెంచినప్పటికీ, పన్నుల ద్వారా ఈ డబ్బును సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవడంలో ఆ రాష్ట్రం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. మొత్తంమీద, గల్ఫ్ నిధులు కేరళ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు ఒక ముఖ్యమైన ఆధారంగా నిలుస్తున్నాయి.

కేరళం కేవలం సామాజిక, ఆర్థిక అభిృద్ధిలోనే కాదు.. అభిరుచుల్లోనూ ప్రత్యేకమే. దేశమంతా క్రికెట్ పిచ్చితో ఉంటే కేరళం ఇప్పటికీ ఫుట్ బాల్ ఆడుతుంది. గ్రౌండ్ లేకపోతే స్కూల్‌కి పర్మిషన్ ఇవ్వని ఏకైక రాష్ట్రం కేరళమే అంటే అతిశయోక్తి కానే కాదు. మనలాగా కోళ్లఫారాల్లాంటి స్కూళ్లు అక్కడ కనపడవు. ఒకప్పుడు- బూతు సినిమాలు మాత్రమే తీస్తారు.. అనే స్థాయి నుంచి ఈరోజు అత్యుత్తమ సినిమాలు తీస్తున్న మలయాళం ఇండస్ట్రీ కేరళందే. వీటన్నిటికీ మించి రాజకీయ చైతన్యం మిగిలిన రాష్ట్రాల కంటే కేరళంలో స్పష్టంగా కనిపిస్తుంది. వోటుకి నాలుగు వేలు ఇవ్వకపోతే బహిరంగంగా వచ్చి మేం వోటేయం అని చెప్పే జనాలు దక్షిణాదిలో చాలామంది వున్నారు. కానీ కేరళంలో ఇంత అరాచకం కనిపించదు. ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గానికి రూ.70-100 కోట్లు పెట్టాల్సిందే. కానీ ఈ రోజుకీ కేరళంలో గ్రామీణ నియోజకవర్గాల్లో అభ్యర్ధి ఖర్చు రూ. 50 లక్షల నుంచి కోటి లోపే. దేశంలో విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా వచ్చే రాష్ట్రం కూడా కేరళమే. ఆరు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నవి కేరళంలోనే. కేరళం ప్రజల జీవన శైలి కూడా సామాన్యమే. ఇప్పుడు కేరళంలో అధికారం ఎవరిదైనా కావొచ్చు. కానీ మలయాళీల అభివృద్ధి చెందిన జీవన ప్రమాణాలు, రాజకీయ చైతన్యం, అభివృద్ధి.. ఇలా ఏ విషయమూ పెద్దగా మారే అవకాశం లేదు. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు అనటానికి నిలువెత్తు నిర్వచనంగా నిలుస్తున్న కేరళం విధానాల్ని.. కచ్చితంగా మిగతా రాష్ట్రాలు అధ్యయనం చేయాల్సిందే. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.

 

 

Exit mobile version